ప్రేమోన్మాది కిరాతకం.. ఓ కుటుంబాన్నే చంపే యత్నం

ప్రేమోన్మాది కిరాతకం.. ఓ కుటుంబాన్నే చంపే యత్నం

నెల్లూరు జిల్లాలో ఓ ప్రేమోన్మాది.. తన ప్రేమకు అడ్డు చెప్పారని ఓ కుటుంబాన్నే అంతమొందించేందుకు యత్నించారు. మందలించారన్న కోపంతో తాను ప్రేమించిన యువతి స్నేహితురాలి ఇంటికి నిప్పు పెట్టాడు. నెల్లూరులో ఇంటర్ చదువుతున్న వంశీ తన సహచర విద్యార్థిని ప్రేమిస్తున్నానంటూ వెంట బడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన స్నేహితురాలికి చెప్పింది. వంశీ కుటుంబంతో యువతి  స్నేహితురాలి కుటుంబానికి పరిచయం ఉండటంతో ఆమె అమ్మమ్మ కమలకుమారి.. వంశీని మందలించారు. దీంతో ఆగ్రహించిన వంశీ.. వారం రోజుల క్రితం కమలకుమారి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే ఆ సమయంలో మేడ మీద వున్న కమలకుమారి కుటుంబసభ్యులు.. దీన్ని షార్ట్ సర్క్యూట్‌గా భావించారు.

కానీ నిన్న సీసీటీవీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. కనిపించడంతో వంశీ పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్టు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకొని ఆ ప్రేమోన్మాదిని అరెస్ట్‌ చేశారు.