జెన్ – జీ సరికొత్త లైఫ్‌‌స్టైల్ ..మెంటల్ హెల్త్ & స్ట్రెస్ రిలీఫ్ .. వీకెండ్ లో భజన క్లబ్బింగ్ ..

జెన్ – జీ సరికొత్త లైఫ్‌‌స్టైల్ ..మెంటల్ హెల్త్ & స్ట్రెస్ రిలీఫ్ .. వీకెండ్  లో భజన క్లబ్బింగ్ ..

జెన్ -జీ సరికొత్త హెల్దీ వీకెండ్ ట్రెండ్! సాంప్రదాయం అంటే బోర్ అనుకునే రోజులు పోయాయి. డిస్కో లైట్లు, పబ్‌‌ల హోరు మధ్య వీకెండ్ ఎంజాయ్ చేసే నేటి జెన్-జీ యువత.. ఇప్పుడు సరికొత్త రూట్‌‌లోకి మళ్లింది. అదే ‘భజన క్లబ్బింగ్’. వీకెండ్ వస్తే చాలు క్లబ్బుల వైపు వెళ్లే యూత్​, ఇప్పుడు చేతిలో తాళాలు పట్టుకుని భజన కూటముల్లో సందడి చేస్తున్నారు. 

కొన్నేళ్ల క్రితం వరకు భజనలు అంటే కేవలం పెద్దవారికే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ నేటి తరం యువత ఆ మైండ్​సెట్‌‌ను పూర్తిగా మార్చేసింది. వీళ్లు భజనలను కేవలం పూజలా కాకుండా, ఒక కమ్యూనిటీ ఎక్స్‌‌పీరియన్స్ లాగ చూస్తున్నారు. మంత్రాలు, శ్లోకాలను కేవలం చదవడమే కాకుండా.. గిటార్, డ్రమ్స్, కీబోర్డ్ వంటి ఆధునిక సంగీత వాయిద్యాలను జోడించి రాక్ బ్యాండ్ పర్ఫార్మెన్స్‌‌లా మారుస్తున్నారు. కీర్తనల ట్యూన్స్‌‌ను ఫాస్ట్ బీట్స్‌‌తో రీమిక్స్ చేస్తూ, అందరూ కలిసి స్టెప్పులేసేలా ఈ పార్టీలను డిజైన్ చేస్తున్నారు. 

సాత్విక ఫుడ్

ఈ పార్టీలలో నాన్-వెజ్ ఐటమ్స్ అస్సలు కనిపించవు. ఇక్కడ వెజిటేరియన్, ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తారు. చాలా ఈవెంట్లలో ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడకుండా స్వచ్ఛమైన సాత్విక ఆహారం అందిస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జంక్ ఫుడ్‌‌కు దూరంగా ఉంటూ హెల్దీ ఆప్షన్స్ వెతుక్కునే యువతకు ఇది బెస్ట్ చాయిస్‌‌.

హెల్దీ డ్రింక్స్ బార్

సాధారణ నైట్‌‌క్లబ్‌‌లలో కనిపించే ఆల్కహాల్, స్మోకింగ్ సంస్కృతికి ఈ భజన పార్టీలు పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ ఆల్కహాల్, కాక్‌‌టెయిల్స్ లేదా కెమికల్స్ ఉండే కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ అస్సలు ఉండవు. వాటి ప్లేస్‌‌లో రకరకాల హెల్దీ మోక్‌‌టెయిల్స్, ఫ్రూట్ జ్యూస్‌‌లు, కొబ్బరి నీళ్లు, బాదం పాలు సర్వ్ చేస్తారు. 

అంతేకాదు, విభిన్న రకాల ఫ్లేవర్డ్ టీ లేదా హెర్బల్ టీలకు ఇక్కడ ప్రత్యేకం. అందుకే దీనిని జెన్-జీ యువత ‘సోబర్ బార్ కల్చర్’ అని పిలుస్తున్నారు. మరుసటి రోజు ఉదయం హ్యాంగోవర్ భయం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు

మెంటల్ హెల్త్ & స్ట్రెస్ రిలీఫ్ 

జెన్-జీ ఈ పార్టీల వైపు మొగ్గు చూపడానికి కారణం మానసిక ప్రశాంతత. నిరంతర కెరీర్ ఒత్తిళ్లు, స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా యాంగ్జైటీల నుంచి విముక్తి కోసం వీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పబ్‌‌లలో దొరికే తాత్కాలిక కిక్ కంటే.. అందరూ కలిసి గొంతు కలిపి పాడే కీర్తనల్లో లభించే పాజిటివ్ వైబ్స్ మనసుకు ఎంతో హాయినిస్తున్నాయని చెప్తున్నారు. 

ఇది ఒక రకమైన గ్రూప్ మెడిటేషన్ లాగ పనిచేస్తూ ఒత్తిడిని దూరం చేస్తోంది. శరీరాన్ని, మనసును రెండింటినీ హెల్దీగా ఉంచే ఈ సరికొత్త లైఫ్‌‌స్టైల్ కల్చర్ రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది.