గచ్చిబౌలి, వెలుగు: యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకోవడానికి మరో యూట్యూబర్ అఖిల్‌రెడ్డితో లవ్ ఫెయిల్యూర్ కారణమని తేలింది. అఖిల్‌రెడ్డి తన ప్రేమను అంగీకరించక పోవడంతో కోమలి సూసైడ్ చేసుకుందని రాయదుర్గం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కోమలి సూసైడ్ చేసుకోవడానికి ముందు అఖిల్‌రెడ్డి ఆమె ఇంటికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వైజాగ్ సిటీకి చెందిన అఖిల్‌రెడ్డి తల్లి స్థానికంగా బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఈక్రమంలో కోమలి బ్యూటీపార్లర్‌కు వచ్చి వెళ్లే క్రమంలో అఖిల్‌తో పరిచయం ఏర్పడింది. 2023 నుంచి స్నేహం కొనసాగుతుండగా, ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు.
ఏడాది కింద మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. అఖిల్ హైదరాబాద్‌లో సోదరి వద్ద ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, కోమలి తన మామ ఇంట్లో ఉంటూ మల్లారెడ్డి వర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. అఖిల్‌తో బ్రేకప్ తర్వాత కోమలి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు గుర్తించి ప్రాణాలు కాపాడారు. ఇటీవల కోమలి అఖిల్‌కు ఫోన్ చేసింది. ఇద్దరం కలిసి మాట్లాడుకుందామని చెప్పడంతో ఈ నెల 21న రాత్రి అఖిల్‌రెడ్డి ఇంటికి వచ్చి, 22న ఉదయం వెళ్లిపోయాడు. ఆ తర్వాత 23న రాత్రి కోమలి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కోమలి తన డైరీలో రాసి పెట్టుకున్న నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఈ నోట్‌ను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోమలి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి వరలక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
