ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.తమ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా కూటమి నేతలు, పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఈ క్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి పరిస్థితిని వివరించారు వైసీపీ అధినేత జగన్. ఈమేరకు ఆదివారం ( అక్టోబర్ 18 ) లోక్ భవన్ కి వెళ్లి గవర్నర్ తో భేటీ అయ్యారు జగన్. వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వివరించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు జగన్. చంద్రబాబుకు గెలుస్తామని నమ్మకం లేదని.. ఎన్నికలు జరిగితే ఓట్లు పడవని భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్ కు వివరించామని.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు జగన్.
రాష్ట్రంలో 8 మున్సిపాలిటీల్లో నామినేషన్లు పడలేదని.. నామినేషన్ల సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు జరిగేటప్పుడు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు జగన్. ఎస్ఈసీ పూర్తిగా లాలూచీ పడిన పరిస్థితి నెలకొందని.. రాజీ పడిన పరిస్థితి నెలకొందని అన్నారు జగన్.
కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారని.. రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా దాటదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అందరం కలిసి కాపాడుకుందామని అన్నారు. వ్యవస్థలు ఇలా తయారైనప్పుడే కాక్రోచ్ లు పుట్టుకొస్తాయని అన్నారు జగన్. నామినేషన్లను ఆన్ లైన్, లేదా సెంట్రలైజ్డ్ చేయాలని అడిగినట్లు తెలిపారు. పారామిలటరీ దళాలను దించాలని... పోలింగ్ బూత్లు, కౌంటింగ్ కేంద్రాలు దగ్గర పెట్టాలని... స్ట్రాంగ్ రూమ్ల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని కోరామని అన్నారు జగన్.
