AP Election 2026: ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది.. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు: వైఎస్ జగన్ 

AP Election 2026: ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది.. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు: వైఎస్ జగన్ 

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వైసీపీ అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు జగన్. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయిందని.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు జగన్. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరుసగా రెండోరోజూ చంద్రబాబు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 

టీడీపీ పార్టీ మూకలకు గూండా లైసెన్స్‌లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడిపిస్తున్నారని అన్నారు జగన్. ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి సృష్టించారని.. వైసీపీ అభ్యర్థులను పోలీసుల సమక్షంలోనే నామినేషన్ కేంద్రాల పరిధిలోనే కత్తులు కర్రలతో వెంటాడటం, నామినేషన్ కేంద్రాలను ముట్టడించడం, అర్థరాత్రి అభ్యర్థులను పోలీసులే ఎత్తుకెళ్ళడం... ఇది చంద్రబాబు మార్క్ ప్రజాస్వామ్యమని దుయ్యబట్టారు జగన్. 

ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారని.. దారుణమేమిటంటే, అభ్యర్థులకు ప్రపోజర్లుగా వెళ్లిన తమ పార్టీ ఎంపీలను కూడా వదల్లేదని అన్నారు. వారి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారని... ముగ్గురు ఎంపీలపై పోలీసుల సమక్షంలోనే, పోలీసుల ద్వారానే దాడులు జరిగాయని అన్నారు. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు జగన్.

కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్లు  కనిపిస్తోందని అన్నారు జగన్.

 పులివెందులలో పోలీసుల కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలేనని... దీని వెనుక ఉన్నది ముమ్మాటికీ చంద్రబాబు కుట్రేనని అన్నారు జగన్.