ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల గడువు పొడిగించాలని వైసీపీ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. నామినేషన్ల సమయం ముగిసిందన్న హైకోర్టు తీర్పు సరికాదని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వైసీపీ పిటిషన్లో గుర్తుచేసింది.
ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగితే ఎస్‌ఈసీ షెడ్యూల్ మార్చవచ్చని తెలిపింది. ఇందుకు ఎన్నికల నిబంధనలు వీలు కల్పిస్తున్నాయని, అత్యున్నత న్యాయస్థానానికి వైసీపీ నివేదించింది.
సుప్రీంకోర్టు ముందు ఆధారాలతో కూటమి పార్టీల అరాచకాలు ఉంచుతున్నామని, పుంగనూరు, కడప, తిరుపతి ఘటనలపై సాక్ష్యాలను సమర్పిస్తున్నామని జగన్ పార్టీ పిటిషన్లో సుప్రీం కోర్టుకు వివరించింది.
అత్యున్నత న్యాయస్థానం ముందు 9 మంది అభ్యర్థుల అఫిడవిట్లు ఉంచి, నామినేషన్లు వేయలేకపోయినవారి పత్రాలను స్వీకరించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏకగ్రీవాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
