
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. శ్రీలంక రాజధాని కొలంబో వెళుతుండగా.. కొడాలి నానిని కోల్ కతా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతా నుంచి విజయవాడకు తీసుకొస్తున్నట్లు సమాచారం. కొడాలి నానిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి.. ఈ క్రమంలోనే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆ లుక్ ఔట్ నోటీసుల ఆధారంగా.. ఎయిర్ పోర్టు అధికారులు ఇచ్చిన సమాచారంతో కోల్ కతా ఎయిర్ పోర్టులో కొడాలి నానిని అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కొడాలి నాని పేరు ఇప్పటికే రెడ్ బుక్ లో ఉంది. ఎన్నికల ముందే మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. బట్టలుఊడదీసి తిప్పుతాం అంటూ వార్నింగ్ కూడా అప్పట్లో ఇచ్చారు మంత్రి నారా లోకేష్. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అమలు చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే పలు కేసుల్లో ఉన్న కొడాలి నానిపై ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కొడాలి నాని అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలపై ఏపీ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అరెస్ట్ చేశాం అని.. అరెస్ట్ చేయలేదు అని చెప్పటం లేదు. దీనిపై సోషల్ మీడియాలో అయితే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొడాలి నాని ఫ్యామిలీ, బంధువులు, ఫ్రెండ్స్ కూడా ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. దీంతో కొడాలి నాని అరెస్ట్ అయ్యారా లేదా.. ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.