Ms Dhoni CSK Mentor: ఐపీఎల్ 2027 (IPL 2027) ముంగిట ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్మెంట్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం తర్వాత హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు వీడ్కోలు పలికిన సీఎస్కే.. భారత మాజీ పేస్ దిగ్గజం జహీర్ ఖాన్‌ను (Zaheer Khan) తమ కొత్త హెడ్ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ నియామకం దాదాపు ఖాయం కాగా, మైఖేల్ హస్సీ స్థానంలో కొత్త బ్యాటింగ్ కోచ్ కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలో దిగ్గజ ప్లేయర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) పాత్రపై, కొత్త కోచింగ్ స్టాఫ్‌పై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ధోనీ రోల్, టీమ్ మెంటార్‌గా బెంచ్‌కే:
మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు, కనీసం మరో ఒక సీజన్ ఆడతాడని అనుకుంటున్నప్పటికీ, మారిన కోచింగ్ వాతావరణంలో అతని పాత్రపై రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశాడు. కొత్త కోచింగ్ స్టాఫ్‌తో ధోనీ, జహీర్ ఖాన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ల మధ్య ఉండే సమీకరణాలు (Dynamics) చూడటం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సీజన్లో ధోనీ బహుశా టీమ్ మెంటార్‌గా (Team Mentor) కొత్త బాధ్యతలు చేపట్టి, బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అలాంటప్పుడు గైక్వాడ్ సలహాల కోసం కొత్త కోచ్ జహీర్ ఖాన్ వద్దకు వెళ్తాడా లేక మెంటార్ హోదాలో ఉండే ధోనీ వద్దకే వెళ్తాడా అనేది కీలకంగా మారిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఫ్లెమింగ్ లేకపోవడం ఆశ్చర్యకరమే:
మాజీ చెన్నై కోచ్ నిష్క్రమణపై కూడా అశ్విన్ మాట్లాడుతూ.. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎప్పుడూ ఎంఎస్ ధోనీ ఆలోచనలకు, శైలికి తగినట్లుగా తనను తాను మలుచుకున్నాడు (Modified himself).. మహీ గ్లవ్స్‌లో సరిగ్గా సరిపోయే వేళ్లలా ఫ్లెమింగ్ ఉండేవాడు. జట్టు, కెప్టెన్ అవసరాలకు తగ్గట్లు సర్దుకుపోవడమే ఫ్లెమింగ్ నైజం.. అలాంటిది కొత్త కెప్టెన్‌తో రెండు మూడేళ్ల అనుబంధం తర్వాత కూడా ఫ్లెమింగ్ కోచ్‌గా కొనసాగకూడదని సీఎస్కే నిర్ణయించుకోవడం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిందని ఆర్. అశ్విన్ తెలిపాడు.
►ALSO READ | భారత్ vs వెస్టిండీస్ 5వ టీ20కి వర్షం కురిసే ఛాన్స్.. బెంగళూరు వెదర్ రిపోర్ట్!
2027లో రుతురాజ్ గైక్వాడ్‌కే కెప్టెన్సీ:
* ధోనీ గాయం: ఐపీఎల్ 2026 సీజన్లో ధోనీ గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. సీజన్ మధ్యలో పునరాగమనం చేస్తాడని భావించినా, ప్రాక్టీస్ మ్యాచ్‌లో మళ్లీ గాయపడటంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు.
* కొత్త కెప్టెన్: ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందే ధోనీ నుంచి కెప్టెన్సీ అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఐపీఎల్ 2027లోనూ సీఎస్కే నయా కెప్టెన్‌గా కొనసాగడం ఖాయమైంది.
* 2023లో ధోనీ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన సీఎస్కే, ఆ తర్వాత 2024, 2025, 2026 సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించి ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. దీంతో ధోనీ-ఫ్లెమింగ్ ఐదు ఐపీఎల్ టైటిళ్ల శకం ముగిసి జహీర్ ఖాన్ రూపంలో కొత్త శకం స్టార్ట్ అయింది.
