
బులవాయో: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. సీన్ విలియమ్స్ (137) సెంచరీతో రాణించినా మిగతా వారు నిరాశపర్చడంతో.. ఆదివారం (జూన్ 30) రెండో రోజు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 251 రన్స్‌కు ఆలౌటైంది. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన సఫారీ బౌలర్లు కీలక టైమ్‌లో వికెట్లు తీసి స్కోరును అడ్డుకున్నారు.
దీంతో 28 రన్స్‌కే కైటానో (0), నిక్ వెల్చ్ (4) ఔట్ కాగా, బ్రియాన్ బెనెట్ (19) రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. ఈ దశలో విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్ (36) మూడో వికెట్‌కు 91 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. వరుస విరామాల్లో ఎర్విన్‌తో పాటు వెస్లీ మదెవెరా (15) ఔట్ కావడంతో జింబాబ్వే కోలుకోలేకపోయింది. ఓ ఎండ్‌లో విలియమ్స్ ఒంటరి పోరాటం చేసినా రెండో ఎండ్‌లో ప్రిన్స్ మసావురె (7), తఫడ్జవా సిగా (9), మసకద్జా (4), ముజరబానీ (0), తనక చివాంగ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు.
సఫారీ బౌలర్లలో వియాన్ ముల్డర్ 4, కేశవ్ మహారాజ్, కొడి యూసుఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసిన తొలి సౌతాఫ్రికా స్పిన్నర్‌గా కేశవ్ రికార్డు సృష్టించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్‌కు 13 ఓవర్లలో 49/1 స్కోరు చేసింది. టోనీ డి జోర్జి (22 బ్యాటింగ్), వియాన్ ముల్డర్ (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బ్రీట్జ్‌కే (1) ఫెయిలయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 216 రన్స్ లీడ్‌లో కొనసాగుతోంది.