ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలైన ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం ( అక్టోబర్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి ..
అంబేద్కర్నగర్కు చెందిన స్వామి జొమాటో ఆఫీసులో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అంబేద్కర్నగర్ నుంచి దమ్మాయిగూడ వైపు మరో వ్యక్తితో కలిసి బైక్ పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామి అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్ర వాహనంపై ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మృతుడు స్వామికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
