ఏఐ (AI) వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, పిల్లలకు కేవలం చదువు మాత్రమే సరిపోదు. కంప్యూటర్లు, రోబోలు చేయలేని కొన్ని స్కిల్స్ పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిన 5 ముఖ్యమైన స్కిల్స్ ఏంటో చూద్దామా....
1. ఎదుటివారిని అర్థం చేసుకోవడం
ఏఐ మన మాటలకు సమాధానాలు ఇవ్వగలదు కానీ, మనలాగా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోలేదు. కోపాన్ని, బాధను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిసిన పిల్లలు జీవితంలో వచ్చే సమస్యలను తట్టుకుంటారు. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. ఇందుకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలు వారి మనసులోని మాటలను ఫ్రీగా చెప్పేలా ప్రోత్సహించాలి. ఇతరుల బాధను అర్థం చేసుకోవడం నేర్పించాలి.
2. సొంతంగా ఆలోచించడం
గూగుల్ లేదా ఏఐ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతికి పెట్టగలవు. కానీ, అసలు ఎలాంటి ప్రశ్నలు అడగాలో మనుషులకే తెలుస్తుంది. ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతిది గుడ్డిగా నమ్మకుండా, ఏది నిజం, ఏది అబద్ధం అని ఆలోచించే శక్తి పిల్లలకు ఉండాలి. భవిష్యత్తులో సమస్యలను గుర్తించి, సొంతంగా మంచి నిర్ణయాలు తీసుకోగలిగే వారికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇందుకు పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు నేరుగా చెప్పేయకుండా... నువ్వేమనుకుంటున్నావ్?, దీనికి ఇంకేం చేయొచ్చు? అని వారిని ఆలోచించేలా చేయాలి.
3. మార్పులను తట్టుకోవడం
భవిష్యత్తులో టెక్నాలజీ వల్ల కొత్త రకాల ఉద్యోగాలు, సరికొత్త సవాళ్లు వస్తాయి. వాటికి త్వరగా అలవాటు పడటం పిల్లలకు చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా అనుకున్నది.. జరగనప్పుడు నిరాశపడకుండా, తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగడానికి ఈ గుణం సహాయపడుతుంది. అందుకే పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునేలా, కొత్త వాతావరణానికి అలవాటు పడేలా చేయాలి. ఓటమి ఎదురైనా మళ్లీ ప్రయత్నించే ధైర్యాన్ని ఇవ్వాలి.
►ALSO READ | పులి, ఆవు నీతి కథ: నిజం ముందు క్రూరుడైనా తల వంచాల్సిందే..!
4. కొత్తగా ఆలోచించడం
ఏఐ ఉన్న సమాచారాన్ని మాత్రమే వాడుకోగలదు, కానీ కొత్తగా ఏదీ ఊహించలేదు. ఊహ అనేది కేవలం మనుషులకు మాత్రమే ఉన్న గొప్ప వరం. డ్రాయింగ్, మ్యూజిక్, కథలు రాయడం లేదా ఒక సమస్యకు సరికొత్తగా సొల్యూషన్ కనిపెట్టడం లాంటివి మనుషులు మాత్రమే చేయగలరు. పిల్లలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా... ఆటలు, కళలు, రకరకాల హాబీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. వారి ఆలోచనలకు స్వేచ్ఛనివ్వాలి.
5. సొంత కాళ్లపై నిలబడటం
టెక్నాలజీ ఎంత పెరిగినా, మన పనులు మనమే చేసుకోవడం కంటే పెద్ద స్కిల్స్ మరొకటి లేదు. వారి పనులు వారే చేసుకునే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యత పెరుగుతాయి. కష్ట సమయాల్లో ఎవరిపైనా ఆధారపడకుండా బ్రతకగలుగుతారు. పిల్లల పనులన్నీ తల్లిదండ్రులే చేసేయకూడదు. వారి వయసుకు తగ్గట్టుగా.. రూమ్ సర్దుకోవడం, చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవడం, వారి ప్లేట్లు వారే కడుక్కోవడం వంటి పనులను అలవాటు చేయాలి.
