మానవజాతి సన్మార్గంలో ప్రయాణించటానికి అవసరమైన విషయాలను వేదాలు మనకు అందించాయి. అందులో సత్యం వద, ధర్మం చర అని శాసనం చేసిన విషయం తెలిసిందే. అంటే... సత్యం పలకాలి, ధర్మం ఆచరించాలి అని అర్థం.సత్యం అంటే నోటితో పలికేది, ధర్మం అంటే చేతలలో ఆచరించేది. ఇలా ఏకవాక్యంలో శాసనం చేసేస్తే అందరికీ అర్థం కాదు కనుక, సత్యం వదకు సంబంధించిన కథ ఒకటి గుర్తు చేసుకుందాం.
ఆవు పులి కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. 'అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉంది. అది రోజూ తన ఆహారం కోసం జంతువులను వేటాడుతూ ఉండేది. ఒకనాడు అలా వేటాడుతుండగా ఒక ఆవు కనిపించింది. 'ఆహా! ఈ రోజు కడుపునిండా. తినొచ్చు' అనుకుంది. అనుకుంటూనే ఆవు మీదకు దూకబోయింది. ఆవు కన్నీళ్ల పర్యంతమై, 'పులిరాజా! నాకు కొద్దిగా సమయం ఇవ్వు. నా బిడ్డ ఇంటి దగ్గర ఉంది. అది చిన్నది దానికి ఈ రోజు ఇంకా పాలివ్వలేదు. పాలు ఇచ్చి వెంటనే వస్తా' అని దీనంగా అర్థించింది.
అందుకు పులి, 'నీ మాటలు నేను ఎలా నమ్ముతా. నీ బిడ్డ దగ్గరకు అని చెప్పి, నువ్వు రాకపోతే ఎలా? నేను నిన్ను విడిచిపెట్టను, తినేస్తా' అంటూ మీదికి దూకబోయింది.ఆవు మరింత దీనంగా, 'పులి రాజా! నేను అసత్యం పలకను. నా దూడకు పాలు ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి, మరుక్షణం నీ దగ్గరకు వచ్చేస్తా అంటూ ప్రాధేయపడింది.ఇలా వారిద్దరి మధ్య కొంతసేపు వాదన నడిచింది.
అప్పటికి పులికి... ఆవు మాటలు నమ్మాలనిపించింది. సరే! అవకాశం ఇచ్చి చూద్దాం! అనుకుని, 'నువ్వు ఒక గంటలో ఇక్కడకు రావాలి. లేదంటే నేనే అక్కడకు వచ్చి, నిన్ను, బిడ్డను కూడా తినేస్తా' అంటుంది. ఆవు పరమానందంతో, పరుగుపరుగున ఇంటికి వెళ్లి, తన లేగదూడకు కడుపునిండా పాలు పట్టి, జాగ్రత్తలు చెప్పి, అంతే వేగంగా పులి దగ్గరకు వచ్చి నిలబడి, 'పులిరాజా! నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు. నా వల్ల నీ ఆహారం ఆలస్యం అయింది. ఇదిగో నా శరీరం. ఈ శరీరం నీకు ఆహారంగా ఉపయోగపడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నీ కడుపు నిండుగా నన్ను తినేయొచ్చు' అని ధైర్యంగా పులితో అంటుంది.
పులికి ఆశ్చర్యం వేసింది. తాను చచ్చిపోతాననితెలిసి కూడా సత్య వాక్పాలన కోసం నాకు ఆహారంగా వచ్చింది. ఎంత గొప్ప మనసు ఈ ఆవుది. ఎంత సత్ప్రవర్తన ఈ గోవుది. ఇటువంటి సాధు ప్రాణిని తింటే నాకు పాపం చుట్టుకుంటుంది... అనుకుంటూనే... 'ఓ గోమాతా! నేను చంపుతానని తెలిసి కూడా నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు నీ లేగదూడతో కలిసి తప్పించుకుని ఎక్కడో తలదాచుకుంటే, నేను మిమ్మల్ని గుర్తించలేకపోతాను కదా. ఆ విధంగా నువ్వు ప్రాణాలు కాపాడుకోవచ్చు. కదా' అని ఎంతో శాంతంగా అడుగుతుంది పులి. అందుకు ఆ కామధేనువు, 'పులి రాజా! నీకు ఆహారంగా వస్తానని చెప్పా. నువ్వు ఎంత ఆకలి మీద ఉన్నావో... నన్ను వెంటనే చంపి తినేసెయ్' అని ఎంతో నిజాయితీగా పలికింది.
తక్షణమే పులిరాజు, ఆ గోమాత పాదాల మీద పడి, నీ సత్యవాక్పాలనకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మాట నిలబెట్టుకోవటం కోసం నువ్వు నీ బిడ్డను కూడా విడిచి వచ్చావు. నీ వంటి ప్రాణిని చంపి, నేను తప్పు చేయను. నువ్వు హాయిగా ఇంటికి వెళ్లి నీ లేగదూడతో జీవించు అని అక్కడ నుంచి వెళ్లిపోయింది పులి. సత్యవాక్యానికి క్రూరజంతువు సైతం తల వంచింది. అంతటి మహద్వాక్యాన్ని వేదాలు బోధించాయి.
సత్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడయ్యాడు. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని సత్యానికి లొంగాడు. దేవతలు అభినందించారు.
నిరంతరం సత్యం పలకమన్నారని ఆపదల సమయంలో కూడా సత్యం పలికితే, మేలు కంటె కీడే జరుగుతుందని భాగవతంలో పోతన వివరించాడు. 'భూత హితంగా పలికే అసత్యం సత్య ఫలాన్ని ఇస్తుంది' అని శాస్త్రకారులు చెబుతున్నారు.
నిజం చెప్పక తప్పని పరిస్థితుల్లో ఏం చేయాలంటే..
ఒక దొంగ ఒక వ్యక్తిని చంపటానికి తరుముతూ వెళ్లాడు. ఆ వ్యక్తి తప్పించుకుంటూ, చెట్లచాటుకు పరుగుతీశాడు. ఆ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఒక ముని చూశాడు. తరుముకొస్తున్న దొంగ, మునితో - 'ఇటువైపుగా ఎవరైనా రావటం చూశారా' అని ప్రశ్నించాడు. ముని సత్యవాక్యానికి లోబడి నిజం పలికితే ఆ వ్యక్తి మరణించటం తథ్యం. అలాగని చూడలేదని పలికితే అసత్య దోషం కలుగుతుంది.
అందుకని ఒక నిమిషకాలం ఆలోచించి, 'చూసేదేమో చెప్పలేదు (కళ్లు), చెప్పేదేమో చూడలేదు (నోరు). నన్నేం చెప్పమంటావు' అని సమయస్ఫూర్తితో అవతలి వ్యక్తి ప్రాణం కాపాడటమే కాకుండా, తనకు అసత్య దోషం కలుగకుండా సమాధానమిచ్చాడు ఆ ముని. అందుకే ఎలాంటి పరిస్థితిలో అబద్దమాడకూడదు. అబద్దం తాత్కాలికంగా మేలు చేసినా.. భవిష్యత్తులో కీడు జరుగుతుందని గ్రహించాలంటున్నారు పెద్దలు.
