రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..కాజీపేట–బల్హార్షా మూడో లైన్ అందుబాటులోకి

 రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..కాజీపేట–బల్హార్షా మూడో లైన్ అందుబాటులోకి

ఉత్తర-దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించే కీలకమైన 'గ్రాండ్ ట్రంక్' రైల్వే మార్గంలో మరో మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్హార్షా మధ్య 203 కిలోమీటర్ల మేర మూడో లైన్ (ట్రిప్లింగ్),విద్యుదీకరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. సుమారు రూ.3,000 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా వెల్లడించింది.

మొత్తం 203 కిలోమీటర్ల పరిధిలో తెలంగాణలో 159 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 44 కిలోమీటర్ల మేర ఈ మూడో లైన్ విస్తరించి ఉంది. తాజాగా ఆసిఫాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల మూడో లైన్, ఎలక్ట్రిఫికేషన్ పూర్తవ్వడంతో పాటు బిబ్రా నదిపై నిర్మించిన కీలకమైన రైల్వే వంతెన పనులు కూడా ముగిశాయి. ప్రస్తుతం బల్హార్షా యార్డ్‌కు కొత్త లైన్‌ను అనుసంధానించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడంతో రైళ్ల రాకపోకల సామర్థ్యం భారీగా పెరగడమే కాకుండా రద్దీ గణనీయంగా తగ్గనుంది. ముఖ్యంగా బొగ్గు, సిమెంట్ పరిశ్రమలతో పాటు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ముడిపదార్థాల రవాణా మరింత వేగవంతం కానుంది. సరుకు రవాణా రైళ్లకు ప్రత్యేక మార్గం లభించడంతో వేగం పెరగడంతో పాటు ప్రయాణికుల రైళ్లు కూడా ఆలస్యం కాకుండా నడిచేందుకు అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా, విద్యుదీకరణ వల్ల ఇంధన వ్యయం తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.

తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలవనుంది. పనులను విజయవంతంగా పూర్తి చేసిన ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్,ఆపరేటింగ్ విభాగాల అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.