సూర్యాపేట మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ ఎందుకు మారిందంటే..

సూర్యాపేట మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ ఎందుకు మారిందంటే..

సూర్యాపేట: సూర్యాపేట మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ను మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట బంద్ జరిగింది. బుల్లెట్ ట్రైన్ సాధన పోరాట కమిటీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్యా పేట బంద్ శుక్రవారం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ డిపో ఎదురుగా నిరసన కారులు బైఠాయించారు.

వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ఆటోనగర్ కార్మికులు, వివిధ ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా సహకరించడంతో శుక్రవారం సూర్యాపేటలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. అయితే.. ఈ బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ ఎందుకు మార్చారనే విషయంలో అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌‌‌‌ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో హైదరాబాద్‌‌‌‌– -చెన్నై కారిడార్ ఒకటి. శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టు, ఫ్యూచర్ సిటీ మీదుగా నార్కట్‌‌‌‌పల్లి, సూర్యాపేట, కోదాడ, నందిగామ, ఏపీ రాజధాని అమరావతి, అక్కడి నుంచి చెన్నై వరకు ఈ లైన్ వెళ్తుందని ప్రతిపాదించారు.

NH-65కు సమాంతరంగా ఈ రూట్ ఉంటుందని, సూర్యాపేటలో స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశపడ్డారు. ఈ ప్రాంతం కమర్షియల్‌‌‌‌గా డెవలప్ అవుతుందని, యువతకు ఉద్యోగాలొస్తాయని అంతా సంబరపడ్డారు. కానీ అలైన్‌‌‌‌మెంట్ మారిపోయింది.

జపాన్‌‌‌‌కు చెందిన షికాన్సెన్ టెక్నాలజీతో గంటకు 350 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి అమరావతికి 70 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. ఇటీవల అలైన్ మెంట్ మార్పు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్గొండ మీదుగా రూట్‌‌‌‌ను ప్రతిపాదిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపింది. ఈ అలైన్‌‌‌‌మెంట్ ప్రకారం శంషాబాద్, ఫ్యూచర్ సిటీ నుంచి మాల్, మల్లేపల్లి, హాలియా, వాడపల్లి మీదుగా దాచేపల్లికి, అక్కడి నుంచి అమరావతికి బుల్లెట్ రైలు వెళ్లనుంది.

పాత రూట్‌‌‌‌తో పోలిస్తే ఈ రూట్‌‌‌‌లో 123 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా సాగర్ సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 400 ఎకరాల డ్రైపోర్టుకు ఈ లైన్ అనుసంధానం చేయడం వల్ల సరుకు రవాణాకు ఈజీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ కూడా ఇక్కడ సులభమనే సాకుతో సూర్యాపేటను ఈ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను నుంచి పక్కకు పెట్టినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.