హైదరాబాద్ సిటీలో వాటర్ ట్యాంకర్ల రేట్లు పెరిగే అవకాశం..?

హైదరాబాద్ సిటీలో వాటర్ ట్యాంకర్ల రేట్లు పెరిగే అవకాశం..?

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో వాటర్ ట్యాంకర్ల రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. అయితే.. ఈ విషయంలో తుది నిర్ణయం ఏంటనేది ప్రస్తుతం ప్రభుత్వం పరిధిలో ఉంది. జలమండలి ట్యాంకర్ అసోసియేషన్ సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది.

జల మండలి ఎండీ అశోక్ రెడ్డి హామీతో సమ్మె నిర్ణయాన్ని అసోసియేషన్ విరమించుకుంది. ట్యాంకర్ రేట్ల పెంపుపై ఎండీతో ట్యాంకర్ అసోసియేషన్ చర్చలు జరిపారు. ట్యాంకర్ నిర్వాహకుల సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు ఎండీకి వివరించారు. నిర్వహణ వ్యయం పెరిగినందున రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు.

తదుపరి బోర్డు సమావేశంలో రేట్ల పెంపుపై ప్రభుత్వంతో చర్చిస్తామన్న ఎండీ తెలిపారు. రేట్ల సవరణకు అవసరమైన ఆమోద ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు. తుది నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుందని ఎండీ స్పష్టం చేశారు.

ఈ పరిణామంపై.. వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ నుంచి నాయుడు మాట్లాడుతూ.. 2017లో ఫిక్స్ చేసిన వాటర్ ట్యాంకర్ల ధరలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో పెట్రోల్ ధరలు, డ్రైవర్ల జీతాలు, ఇతర ట్యాక్స్లు మెయింటెనెన్స్లు పెరిగిపోయాయని తెలిపారు.

ధరలు పెంచాలని ఎండీ దృష్టికి తీసుకెళ్లామని, ఎండీ సానుకూలంగా స్పందించారని.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకటించే వరకు తాము ఎలాంటి సమ్మెలు చేయమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని, ట్యాంకర్కి 400 పెంచితే తమకు వర్కౌట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమణ చేస్తున్నామని, ట్యాంకర్ సేవలు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు.