హైదరాబాద్‎లో భారీ వర్షం.. నగరవాసులకు GHMC కీలక సూచన

హైదరాబాద్‎లో భారీ వర్షం.. నగరవాసులకు GHMC కీలక సూచన

హైదరాబాద్‎లో భారీ వర్షం ‎కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి,  టోలిచౌకి, షేక్ పేట్, ఓయూ కాలనీ, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, తార్నాక, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. 

వరద నీటితో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరిగ్గా ఆఫీసులు, విద్యాసంస్థలు మూసి ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం కురువడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీ కారిడార్‎లో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో ఐటీ ఎంప్లాయిస్ తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‎ను క్రమబద్దీకరిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీరు నిలిచే ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టారు. మరికొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు ఇండ్లలోనే ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.