రూ.2 లక్షల లంచం కేసులో కీసర SI అరెస్ట్

రూ.2 లక్షల లంచం కేసులో కీసర SI అరెస్ట్

హైదరాబాద్: కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చీటింగ్ కేసుతో పాటు 498 (ఏ) వరకట్న వేధింపుల కేసులో అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలో బాధితుల నుంచి ఎస్‌ఐ శ్రీనివాస్ రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

అనంతరం కేసు చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రూ.2 లక్షలు లంచంగా అడిగినట్లు సమాచారం. ఎస్ఐ భారీగా లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐని పక్కా సాక్ష్యాధారాలతో పట్టుకునేందుకు పథకం రచించారు. 

ఇందులో భాగంగానే సోమవారం (నవంబర్ 8) నాగారం పరిధిలోని శిల్పానగర్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో బాధితుల నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్‌ఐ శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీనివాస్‎పై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

ఇటీవల ఇదే కీసర పోలీస్ స్టేషన్‌లో సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఎస్‌ఐ ఏసీబీ వలకు చిక్కడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అవినీతి ఘటనలు పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి.