BJP వల్లే బ్రాహ్మణులు ముస్లింల మద్దతు కోల్పోయారు: ముస్లింలతో వివాదం ఏంటంటూ సూటి ప్రశ్న?

BJP వల్లే బ్రాహ్మణులు ముస్లింల మద్దతు కోల్పోయారు: ముస్లింలతో వివాదం ఏంటంటూ సూటి ప్రశ్న?

జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్‌లోని మిథిలాలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బ్రాహ్మణుల సమావేశంలో పీకే మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం ఓట్ల మద్దతు, బీజేపీతో పొత్తుల అంశంపై పీకే చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి.

ఒకప్పుడు బ్రాహ్మణులకు ముస్లింల సపోర్ట్:
ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బీహార్‌లో సుమారు 18 శాతం జనాభా ఉన్న ముస్లింల మద్దతును ఒకప్పుడు రాష్ట్రంలోని బ్రాహ్మణ నాయకులు పొందేవారని గుర్తుచేశారు. గతంలో బీహార్ రాజకీయాల్లో బ్రాహ్మణ నేతల వెనుక ముస్లిం వర్గం నిలబడేదని.. కానీ కాలక్రమేణా ఆ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. కేవలం సంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాలు, సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే బ్రాహ్మణులు తమ బలమైన సామాజిక మద్దతును కోల్పోవాల్సి వచ్చిందని విశ్లేషించారు.

బ్రాహ్మణులు ఆరాధించే పరశురాముడిని ప్రస్తావిస్తూ.. ప్రశాంత్ కిషోర్ మిథిలా ప్రాంత బ్రాహ్మణులతో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. బ్రాహ్మణుల అసలు బలం గొడ్డలి పట్టడంలో కాదని.. కలం పట్టుకోవడంలో, పుస్తకాలు చదవడంలో, శతాబ్దాల నాటి విద్యా సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో, అలాగే విజ్ఞానానికి, జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవిని ఆరాధించడంలోనే ఉందని గుర్తుచేశారు పీకే. 

బీజేపీతో పొత్తే కథ మార్చేసింది:
బ్రాహ్మణులు రాజకీయంగా తమ మద్దతును ఎందుకు కోల్పోయారనే విషయాన్ని వివరిస్తూ పీకే చాలా స్పష్టమైన విమర్శలు చేశారు. బ్రాహ్మణ నాయకులు ఎప్పుడైతే బీజేపీతో జతకట్టారో.. అప్పుడే ముస్లింల మద్దతు వారికి పూర్తిగా దూరమైందని అభిప్రాయపడ్డారు. "మీరు ఎప్పుడైతే బీజేపీ జెండాను భుజాన వేసుకున్నారో.. అప్పుడే ముస్లిం ఓట్లు మీ నుంచి దూరమయ్యాయి" అని కుండబద్దలు కొట్టారు బ్రాహ్మణుల సమావేశంలో. సోషల్ మీడియా వేదికగా కొందరు ముస్లింలపై వ్యతిరేక ప్రచారాలు చేయడం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం వల్లనే ఈ సామాజిక దూరం రోజురోజుకూ పెరుగుతూ వచ్చిందని వెల్లడించారు. 

భూముల కోసమా? రిజర్వేషన్ల కోసమా?
ఈ సందర్భంగా బ్రాహ్మణులను ఉద్దేశించి పీకే కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. ముస్లింలతో మీకు అసలు ఎలాంటి వివాదం ఉందని ప్రశ్నించారు. భూముల విషయంలో గొడవా? లేక రిజర్వేషన్ల విషయమా? అంటూ సూటిగా నిలదీశారు. ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియాలో ముస్లింలపై విమర్శలు చేస్తూ, వారిని దూషిస్తూ.. మళ్లీ వారు ఎప్పుడూ ఓటు వేయాలని కోరుకోవటం ఎలా సాధ్యమవుతుందని పీకే ప్రశ్నించారు బ్రాహ్మణ నేతలను. ఒకప్పుడు తమ వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గం దూరం కావడానికి గల అసలు కారణాలను బ్రాహ్మణులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

ALSO READ : రూ.500 నోట్ల రద్దు చేయాలి

ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో సంప్రదాయ కూటముల రాజకీయాలకు గట్టి సవాలుగా మారాయి. బీజేపీ, ముస్లింల మధ్య సంబంధాలు, అగ్రవర్ణాల రాజకీయ భవిష్యత్తుపై పీకే లేవనెత్తిన ఈ అంశాలు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.