స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం.. రెండున్నరేళ్ల అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలిచ్చిన ఆమోదం: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం.. రెండున్నరేళ్ల అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలిచ్చిన ఆమోదం: సీఎం చంద్రబాబు

ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. సోమవారం ( నవంబర్ 9 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం రెండున్నరేళ్ల అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలిచ్చిన ఆమోదమని అన్నారు చంద్రబాబు. 

2024 ఎన్నికలతో పోలిస్తే... స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బలం పుంజుకుందని అన్నారు. స్థానిక సంస్థల్లో పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9శాతం ఓట్లు సాధించిందని.. 2024 ఎన్నికల్లో ఇది 55.3శాతం ఉందని.. స్థానిక ఎన్నికల నాటికి ఎన్డీయేకు 3.6 శాతం ఓట్లు పెరిగాయని అన్నారు చంద్రబాబు.

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మొత్తంగా 33.56 శాతం ఓట్లు పడ్డాయని.. 2024లో వైసీపీకి 39.81శాతం వచ్చాయని.. ఈ ఎన్నికల నాటికి వైసీపీకి 6.25శాతం తగ్గాయని అన్నారు.మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి-వైసీపీకి మధ్య 25.34 శాతం మేర గ్యాప్ ఉందని అన్నారు చంద్రబాబు.

పట్టణాల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 59.9 శాతం-వైసీపీకి 34.3శాతం-ఎన్డీఏ స్ట్రైక్ రేట్ 94 శాతంగా ఉందని అన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 57.6 శాతం-వైసీపీ 39.7 శాతం-ఎన్డీఏ స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా ఉందని... పట్టణాల్లో 25.60 శాతం, పల్లెల్లో 17.9 శాతం మేర కూటమికి-వైసీపీకి ఓట్ల శాతంలో వ్యత్యాసం ఉందని అన్నారు చంద్రబాబు.

ఇక ఎంపీటీసీల విషయానికొస్తే.. 9818 స్థానాలకు గానూ కూటమి 7803 స్థానాలను దక్కించుకుందని...  రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పట్టణాల్లో ఎన్డీఏకు పడ్డ పోస్టల్ బ్యాలెట్లు 65.7 శాతం-వైసీపీకి 27.42 శాతంగా ఉందని అన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఎన్డీఏ 62.83 శాతం పోస్టల్ బ్యాలెట్లు పడితే.. వైసీపీకి 31.46 శాతం పడ్డాయని అన్నారు చంద్రబాబు. 

మొత్తం 659 జెడ్పీటీసీలకు గానూ.. 575 స్థానాలను కూటమి గెలుచుకుందని... జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించిందని అన్నారు చంద్రబాబు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీకి కూటమి కంటే ఎక్కువ సీట్లు సాధించిందని... 7 జిల్లాల్లో వైసీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదని అన్నారు చంద్రబాబు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీకి ఒక్క జడ్పిటిసి కూడా రాలేదని అన్నారు చంద్రబాబు.