రూ. 13 లక్షల డీల్..  ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగం..నల్లగొండలో 14 మంది అరెస్ట్

రూ. 13 లక్షల డీల్..  ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగం..నల్లగొండలో 14 మంది అరెస్ట్

నల్లగొండ: ఫేక్  డెత్ సర్టిఫికెట్ సృష్టించి ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యవహారంలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ మోసానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు సహకరించిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, ఆయన కుమారుడు చామకూరి రాజుకు కారుణ్య నియామకం కల్పించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు.PHC శాలిగౌరారం సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి, బంధువులు చామకూరి రాజశేఖర్ (మీ సేవా AO), చామకూరి రవీందర్ (హెల్త్ అసిస్టెంట్, PHC కేతేపల్లి), రాచకొండ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ గౌడ్, మృతుడి భార్య వసంత, కుమారుడు రాజు కలిసి ఈ పథకానికి  ప్లాన్  చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలో నల్లగొండ DMHO కార్యాలయంలో CCగా పనిచేస్తున్న పోలె రంజిత్ కుమార్‌ను సంప్రదించి, మృతుడి భార్య వసంతతో రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.మున్సిపల్ వార్డు ఆఫీసర్ శివ జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, మీ సేవా AO రాజశేఖర్, మీ సేవా కేంద్ర నిర్వాహకుడు చందు  కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించినట్లు విచారణలో తేలింది.

అలాగే శాలిగౌరారం PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకుల కృష్ణ సూర్య శిల్ప తన సంతకంతో సంబంధిత దరఖాస్తు ఫైలును DMHO కార్యాలయానికి పంపినట్లు పోలీసులు గుర్తించారు.DMHO కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ గింకల రాకేష్, జూనియర్ అసిస్టెంట్ తుంగతుర్తి మోహన్ కృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహబూబ్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి, CC పోలె రంజిత్ కుమార్, PHC శాలిగౌరారం సీనియర్ అసిస్టెంట్ జగన్నాధ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులతో కుమ్మక్కై DMHOకు తప్పుడు నివేదిక సమర్పించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ నకిలీ పత్రాల ఆధారంగా చామకూరి రాజుకు దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లు పోలీసులు గుర్తించారు.


నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.299/2026గా కేసు నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 318(4), 336(3), 338, 340(2), 61(2), 212(a), 236, 237 సెక్షన్లతో పాటు ఐటీ చట్టం, ఆధార్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.