2027 ఎన్నికల్లో 80 శాతం సీట్లు మావే..యూపీ ఎన్నికలపై యోగి మాస్టర్ ప్లాన్!

2027 ఎన్నికల్లో 80 శాతం సీట్లు మావే..యూపీ ఎన్నికలపై యోగి మాస్టర్ ప్లాన్!


యూపీలో మళ్లీ అధికారమే లక్ష్యం.. 80-20 ఫార్ములాతో యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు!

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో  సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 80 శాతం ఓట్లు, 80 శాతం అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఓ ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ తన 80-20 ఫార్ములాను మరోసారి ప్రస్తావించారు. బీజేపీ, దాని మిత్రపక్షాలకు 80 శాతం ఓట్లు వస్తాయని, మిగిలిన 20 శాతం ఓట్లు ప్రతిపక్షాలకు వెళ్తాయని అన్నారు.

అంతేకాదు, ఇదే సమీకరణ సీట్ల విషయంలోనూ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ 350 సీట్ల మార్కును దాటుతుందా? అని ప్రశ్నించగా, ఎన్డీఏ కూటమి కనీసం 80 శాతం అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. అయితే కచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయనే సంఖ్యను వెల్లడించలేదు.

403 స్థానాల్లో 322 సీట్లు సాధ్యమేనా?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. యోగి చెప్పిన 80 శాతం సీట్ల లెక్కను పరిశీలిస్తే ఎన్డీఏ కూటమి సుమారు 322 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 81 స్థానాలు ప్రతిపక్షాలకు దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఇవి యోగి వ్యాఖ్యల ఆధారంగా వేసిన గణాంకాలే తప్ప, ఎన్నికల సర్వే ఫలితాలు కావు.

2017లో భారీ విజయం.. 2022లో తగ్గిన బలం

గత రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ ప్రస్థానంలో ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏకంగా 325 స్థానాలను గెలుచుకుంది. ఇందులో బీజేపీ ఒక్కటే 312 స్థానాలను కైవసం చేసుకుంది.అయితే 2022 ఎన్నికల్లో కూటమి బలం తగ్గింది. ఎన్డీఏ 273 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీజేపీ 255 స్థానాలను గెలుచుకుంది.

2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా యోగి ఆదిత్యనాథ్ 80-20 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారు. జాతీయవాదం, సుపరిపాలన, అభివృద్ధిని విశ్వసించే 80 శాతం మంది ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలుస్తారని అప్పట్లో వ్యాఖ్యానించారు.ఇప్పుడు మరోసారి అదే ఫార్ములాను ప్రస్తావిస్తూ రాబోయే ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తానికి 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన అంచనాలు ఎన్నికల్లో ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.