న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత వాయుసేన (ఐఏఎఫ్) మరో అరుదైన రికార్డు సాధించింది. తూర్పు లడఖ్‌లోని వ్యూహాత్మక న్యోమా ఎయిర్ బేస్‌లో రష్యా తయారీ భారీ రవాణా విమానం ‘ఐఎల్-76’ విజయవంతంగా ల్యాండ్ అయింది. సముద్ర మట్టానికి ఏకంగా 13,629 అడుగుల ఎత్తులో ఈ విమానాన్ని దింపి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ల్యాండ్ అయిన విమానంగా ఐఎల్-76 చరిత్ర సృష్టించింది.
చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖకు కేవలం 25 కి.మీ. దూరంలో ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా, ఈ చరిత్రాత్మక విజయంపై భారత వాయుసేన హర్షం వ్యక్తం చేసింది. విమాన అద్భుత సామర్థ్యంతోపాటు సిబ్బంది అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వమే ఈ మైలురాయికి కారణమని కొనియాడింది. ఇది భారత్ వ్యూహాత్మక రవాణా సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని పేర్కొంది.
