డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా ఎయిర్‌ఫీల్డ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాయుసేన జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు మిఠాయిలు పంచిపెట్టారు. సరిహద్దుల్లో జవాన్లు రేయింబవళ్లు కాపలా కాస్తున్నందువల్లే దేశ ప్రజలు పండుగలను నిర్భయంగా జరుపుకోగలుగుతున్నారని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌తో భారత వైమానిక దళ శక్తి ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీని సైనికులు అవలంబిస్తుండటం గర్వంగా ఉందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా సైనికుల్లో క్రమశిక్షణ, ధైర్యం లేకుంటే ప్రయోజనం ఉండదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. క్రమశిక్షణే సాధారణ సైనికుడిని అసాధారణ యోధుడిగా మారుస్తుందని చెప్పారు.
దేశ రక్షణతో పాటు విపత్తుల సమయంలో సహాయ చర్యల్లోనూ వాయుసేన సిబ్బంది ముందుంటారని ప్రశంసించారు. డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త యుద్ధ పద్ధతుల్లో సైనికులు మరింతనైపుణ్యం సాధించాలని సూచించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త టెక్నాలజీని ఆయుధంగా చేసుకోవాలన్నారు. దేశ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ ముందుకెళ్తున్నదని రాజ్‌నాథ్ తెలిపారు.
