గమయ్య గూడెం అనే గ్రామంలో జం మల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి వ్యవసాయం చేసేవాడు. ఎప్పుడూ పొలంలో పని చేస్తూ, పంటను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. మొక్కలకు ఎరువులు వేయడం, నీళ్లు పెట్టడం, కలుపు తీయడం వంటి పనులన్నీ సరైన టైంలో చేసేవాడు. దాంతో పంట చాలా ఎక్కువగా పండేది. నాణ్యత కూడా బాగుండేది.. ఆ ఊర్లోనే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అతనికి మంచిపేరు వచ్చింది. మల్లయ్య పొలంలో పంట బాగా పండుతుందని, నాణ్యంగా ఉంటుందని తెలిసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పంటను చూసి వెళ్లేవాళ్లు.
ఈ సంగతి ఆ నోటా ఈ నోటా రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు మల్లయ్యను పిలిచి తాను చేస్తున్న పనికి మెచ్చుకొని అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు తగిన బహుమతి ఇచ్చి పంపించాడు.ఆ విషయం తెలుసుకున్న జంగమయ్య గూడెం గ్రామస్తులు మల్లయ్య ఇంటికి వచ్చి అభినందించారు. తనను అభినందించిన అందరికీ తన పొలంలో పండిన ధాన్యాన్ని తలా కుండెడు ఇచ్చాడు. 'ఈ ధాన్యాన్ని మీ పొలాల్లో విత్తనాలుగా చల్లితే.. పంటలు బాగా పండుతాయ'ని చెప్పాడు.
అప్పుడు మల్లయ్య బంధువుల్లో ఒకతను “నీ ధాన్యాన్ని విత్తనాలుగా వాడితే వాళ్ళ పంటలు కూడా బాగా పండుతాయి కదా! అప్పుడు నీ ప్రత్యేకత ఏముంటుంది? నిన్ను ఎవరు మెచ్చుకుంటారు? నీవు అలా చేయకుండా ఉండాల్సింది" అన్నాడు..అందుకు మల్లయ్య.. “నా పొలం చుట్టుపక్కల పొలాల్లో వేసే విత్తనాలు మంచివి కాకపోతే, అక్కడ మంచి పంటలు పండవు. కాబట్టి పక్షులు నా పొలంలో ధాన్యాన్నే తింటాయి. దానివల్ల నా దిగుబడి తగ్గుతుంది. కాబట్టి నా పొలంలో ఎప్పుడూమంచిపంట పండాలంటే దాని చుట్టుపక్కల పొలాల్లో కూడా పంటలు బాగా పండాలి.
అందుకే నేను వాళ్లకు మంచి ధాన్యాన్ని విత్తనాలుగా ఇచ్చాను. పైగా నాకు గుర్తింపు రావడం కన్నా వాళ్లకు బాగా పంటలు పండితేనే నాకు ఎక్కువ సంతోషం" అన్నాడు. మల్లయ్య. అతని విశాలబుద్ధిని చూసి రైతులు అందరూ మెచ్చుకున్నారు.
-కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి, నల్గొండ
