Summer Holidays Review: నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ‘సమ్మర్ హాలిడేస్’.. చిన్నారుల నటనకు ఆడియన్స్ ఫిదా!

Summer Holidays Review: నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ‘సమ్మర్ హాలిడేస్’.. చిన్నారుల నటనకు ఆడియన్స్ ఫిదా!

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays) చిన్నారుల సందడితో థియేటర్లలోకి వచ్చేసింది. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ ఖుషి లీడ్ రోల్స్‌లో శ్రీకర్ నయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించారు. జయసుధ, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, వాసుకి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇవాళ శుక్రవారం (నవంబర్ 6, 2026న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు, తొలి రోజు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? ఇందులో నటించిన చిన్నారులు తమ పాత్రలు, షూటింగ్ అనుభవాల గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం..

‘సమ్మర్ హాలిడేస్’ కథేంటి?

చదువుల ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, చిన్ననాటి స్నేహాలు, వేసవి సెలవుల మధుర జ్ఞాపకాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. నగరంలో పెరిగిన ఆర్‌వీ (మాస్టర్ అరుణ్ దేవ్) చదువులో మంచి మార్కులు సాధించాలనే తండ్రి ఒత్తిడిని ఎదుర్కొంటుంటాడు. క్రికెట్ అంటే ఇష్టమైనా, తండ్రి పెట్టే ఆంక్షలతో తన బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతుంటాడు. ఈ క్రమంలో వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరు తోటవారిపాలెంకు వెళ్తాడు.

అక్కడ కేవీ (మాస్టర్ రోహన్) పరిచయం అవుతాడు. పేదరికంలోనూ ఎప్పుడూ నవ్వుతూ ఉండే కేవీ తన తల్లి కోసం ఎన్నో కష్టాలు పడుతుంటాడు. తల్లిని అవమానించే పరిస్థితులను చూసి, ఆమెకు ఓ మంచి చీర కొనివ్వాలనే లక్ష్యంతో ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ ఇద్దరు చిన్నారుల మధ్య ఏర్పడే స్నేహం, వారి జీవితాల్లో తీసుకొచ్చే మార్పులు, మామిడి తోట నేపథ్యంలో జరిగే సంఘటనలు కథలో ఆసక్తికరంగా ఉంటాయి. పిల్లల బాల్యం, కుటుంబ బంధాలు, స్నేహం, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరించాలనే అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు.

నవ్విస్తూ.. భావోద్వేగానికి గురిచేస్తూ..

సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. చిన్నారుల నటన, స్నేహం, కుటుంబ భావోద్వేగాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా రోహన్, అరుణ్ దేవ్ తమ నటనతో ఆకట్టుకున్నారని ఆడియన్స్ ప్రశంసలు కనిపిస్తున్నారు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పటి జ్ఞాపకాలు, స్నేహితులతో ఆడుకున్న ఆటలు, పల్లెటూరి వాతావరణం ప్రేక్షకులకు తమ బాల్యాన్ని గుర్తు చేస్తున్నాయి.

ALSO READ :  SCENE Review: సూర్య ‘సీన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

కేవలం కామెడీకే పరిమితం కాకుండా కొన్ని సన్నివేశాలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయని ఫస్ట్ షో చూసిన ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కేవీ తన తల్లి కోసం పడే తపన, ఆర్‌వీతో అతడికి ఏర్పడే అనుబంధం, జయసుధ అమ్మమ్మ పాత్ర, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని అంటున్నారు. 

అయితే సినిమా కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగడం, ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోవడం వంటి అంశాలు మైనస్‌లుగా కనిపిస్తున్నాయని మరికొందరు ట్వీట్స్ పెడుతున్నారు. మొత్తంగా చిన్నారుల నటన, స్నేహం, కుటుంబ అనుబంధాలు, చిన్ననాటి జ్ఞాపకాలతో రూపొందిన ఈ చిత్రం పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందా?

చిన్నారుల స్నేహం, అమ్మపై ప్రేమ, కుటుంబ బంధాలు, చదువుల ఒత్తిడి వంటి అంశాలను వినోదం, భావోద్వేగాల మేళవింపుతో చూపించిన చిత్రమే ‘సమ్మర్ హాలిడేస్’. ముఖ్యంగా పిల్లల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి సందేశాన్ని అందిస్తుంది. చిన్నారుల నటన, అమ్మమ్మ ఇంటి జ్ఞాపకాలు, స్నేహంలోని మాధుర్యం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

చిన్నారుల మాటల్లో ‘సమ్మర్ హాలిడేస్’ విశేషాలు:

మాస్టర్ రోహన్ మాట్లాడుతూ ‘ఈ  సినిమాలో నా క్యారెక్టర్ పేరు కె. వి.  లైఫ్‌‌‌‌లో ఎన్ని  అవమానాలు ఎదురైనా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ..  కుటుంబం కోసం, అమ్మ కోసం కష్టపడే పాత్రలో కనిపిస్తా.  నా క్యారెక్టర్ ఎనర్జిటిక్‌‌‌‌గా ఉంటుంది. ఇందులో  కామెడీతో పాటు  ఎమోషన్ సీన్స్ చేసే అవకాశం దక్కింది. నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే పాత్ర చేయడం చాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది. నేను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా. చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే, క్లాస్‌‌‌‌లు మిస్ కాకుండా షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నా’ అని చెప్పాడు.

మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఆర్.వి. అనే రోల్ చేశాను. ఈ పాత్ర చాలా కామ్‌‌‌‌గా ఉంటుంది. తనకు లైఫ్‌‌‌‌లో  ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ అతని లైఫ్‌‌‌‌లో సంతోషం ఉండదు. జయసుధ గారి లాంటి పెద్ద నటితో నటించడం గౌరవంగా భావిస్తున్నా.  ఆమె నాకు ఎన్నో సజెషన్స్ ఇచ్చేవారు. - నేను నటుడిగా స్టేట్, నేషనల్ అవార్డ్స్ పొందానంటే కారణం మా అమ్మ. ఆమె మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. నేను ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నా.  షూటింగ్స్ వల్ల  ఎక్కువగా స్కూల్‌‌‌‌కు వెళ్లలేకపోతున్నా’ అని చెప్పాడు.