షుగర్ పేషెంట్లకు అలర్ట్.. ఈ 3 విటమిన్లను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. లోపిస్తే ఆరోగ్యంపై మరింత ప్రభావం!

షుగర్ పేషెంట్లకు అలర్ట్.. ఈ 3 విటమిన్లను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. లోపిస్తే ఆరోగ్యంపై మరింత ప్రభావం!

షుగర్ ఉందని తెలిసినప్పటి నుంచి పేషెంట్లు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణపై ఎక్కువ శ్రద్ద చూపుతారు. షుగర్ లెవెల్స్  కంట్రోల్ లో ఉంటే  ఎటువంటి ప్రమాదం లేదని అనుకుంటారు. అయితే షుగర్ లెవెల్స్ నియంత్రణే కాదు.. శరీరంలో విటమిన్ల స్థాయిలపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ బి1 లోపం ఉంటే షుగర్ వల్ల కలిగే సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇవి జీవక్రియను అస్థిర పర్చి నరాల దెబ్బతినడం వంటి షుగర్ సంబంధిత సమస్యలను వేగంగా పెంచుతాయని షుగర్ పేషెంట్లు ఈ మూడు విటమిన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ విటమిన్లు శరీరంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? వీటి లోపం డయాబెటిస్ రోగులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం.

షుగర్ ఉన్నవారు విటమిన్ డి , విటమిన్ బి12 ,విటమిన్ బి1 (థయామిన్) స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఇవి జీవక్రియ నియంత్రణను మరింత దిగజార్చగలవు.నరాల దెబ్బతినడం వంటి షుగర్ సంబంధిత సమస్యలను ఇవి వేగంగా పెంచుతాయి. 

విటమిన్ డి

ఇన్సులిన్ సున్నితత్వాన్ని ,ఇన్సులిన్‌ను తయారుచేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాల పనితీరును విటమిన్ డి ప్రభావితం చేస్తుంది. ఇంకా రక్తనాళాల వాపు ,ధమనుల బిగువును తగ్గించడంలో సహాయపడుతుంది.షుగర్ ఉన్నవారిలో 60శాతం నుంచి 70శాతం కంటే ఎక్కువ మందిలో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. దీని తక్కువ స్థాయిలు ఇన్సులిన్ నిరోధకతను మరింత పెంచుతాయి. దీంతో మందులతో కూడా రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టమయ్యే అవకాశం ఉంది. గుండె సమస్యల ప్రమాదాన్ని  అధికం చేస్తాయి. డి విటమిన్ తగ్గితే అలసట, కండరాల బలహీనత, ఎముక లేదా వెన్ను నొప్పి వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

విటమిన్ బి12 (కోబాలమిన్)

బి12  విటమిన్.. ఎర్ర రక్త కణాల ఏర్పాటు, మెదడు పనితీరు, నరాల చుట్టూ ఉండే రక్షిత మైలిన్ పొరను కాపాడేందుకు ఇది అత్యవసరం. మధుమేహం ఉన్నవారిలో ముఖ్యంగా చాలాకాలంగా మెట్‌ఫార్మిన్ తీసుకునేవారు బి12 లోపానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే మెట్‌ఫార్మిన్ పేగులలో దాని శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా బి12 లోపం డయాబెటిక్ న్యూరోపతికి  అంటే చేతులు ,పాదాలలో జలదరింపు, తిమ్మిరి, మంటతో కూడిన నొప్పికి కారణమవుతుంది.అప్పటికే ఆలక్షణాలు ఉంటే మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది సాధారణ షుగర్ సంబంధిత నరాల నష్టాన్ని భావించొచ్చు. కాళ్లు చేతులు తిమ్మిరి ,సూదులతో గుచ్చినట్లు అనిపించడం, దీర్ఘకాలిక అలసట, నీరసం, సమతుల్యత సమస్యలు వంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి చెక్ చేయించుకోవాలి. 

విటమిన్ బి1 (థయామిన్)

శరీరంలో కార్బోహైడ్రేట్లను జీర్ణించుకోవడానికి  విటమిన్ బి1 సాయపడుతుంది. అధిక గ్లూకోజ్ జీవక్రియ ఏర్పడే ఉప-ఉత్పత్తుల వల్ల కలిగే నష్టం నుంచి చిన్న రక్తనాళాలను,నరాలను కాపాడుతుంది. అధిక రక్త చక్కెర, శరీరంలో థయామిన్ నిలువలను తగ్గిస్తుంది. విటమిన్ బి1 లోపంతో కంటికి నష్టం కలిగించే డయాబెటిక్ రెటినోపతి, నరాల క్షీణత వంటి మైక్రోవాస్కులర్ సమస్యలను మరింత పెంచుతుంది. అలసట, ఆకలి లేకపోవడం,ప్రారంభ నాడీ సంబంధిత లక్షణాలు విటమిన్ బి1 లోపం వల్ల కనిపిస్తాయి. 

డయాబెటీస్ ఉన్నవారు కేవలం షుగర్ లెవల్స్ మాత్రమే కాకుండా, కనీసం ఏడాదికోసారైనా ఈ విటమిన్ల స్థాయిలను చెక్ చేసుకొని డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తలు లేదా సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: నిపుణుల సలహాలతో కూడిన ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది ఏ విధంగానూ అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ  వ్యక్తిగత డాక్టర్ ను సంప్రదించండి. ఈ సమాచారానికి వీ6 యాజమాన్యం గానీ, కంటెంట్ రైటర్ గానీ బాధ్యత వహించదు.