అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా రిపబ్లికన్ల అధీనంలో ఉన్న కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు పాగా వేశారు. రిపబ్లికన్ల కంచుకోటలుగా చెప్పుకునే ఒహాయో, అయోవా, జార్జియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయ ఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో ఇటు అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయమే మిగిలింది. ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ధరలు, ట్రంప్ నాయకత్వంపై అమెరికన్ ఓటర్ల అసంతృప్తిని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ట్రంప్ తిక్క నిర్ణయాలకు అమెరికన్ ప్రజలు గట్టి బుద్దిచెప్పారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, రిపబ్లికన్ పార్టీకి చారిత్రలో ఎన్నడూలేనంతగా ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న రాష్ట్రాలలో డెమోక్రాట్లు భారీ విజయం సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఒహాయో, అయోవా, 28 ఏళ్ల తర్వాత జార్జియా, 36 ఏళ్ల తర్వాత టెక్సాస్‌లను డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు.ఊహించినట్లుగానే గవర్నర్ ఎన్నికల పోటీలలో, ఒహాయోలో డాక్టర్ అమీ ఆక్టన్, అయోవాలో రాబ్ సాండ్, జార్జియాలో కీషా లాన్స్ బాటమ్స్, టెక్సాస్‌లో గినా హినోజోసా వంటి డెమొక్రాటిక్ అభ్యర్థులు చారిత్రాత్మక విజయాలు నమోదు చేసి, ఈ రాష్ట్రాలలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రిపబ్లికన్ల ఆధిపత్యానికి ముగింపు పలికారు.
గత 20 ఏళ్లుగా ఒహాయో ,అయోవా రాష్ట్రాల ప్రజలు డెమోక్రటిక్ గవర్నర్లను ఎన్నుకోలేదు.1998 నుంచి జార్జియాను రిపబ్లికన్ పార్టీ ఏలుతోంది. ఇక 1990 నుంచి టెక్సాస్ లో ఒక్క డెమోక్రటిక్ ను కూడా గవర్నర్ గా ఎన్నుకోలేదు. తాజాగా డెమోక్రాట్లు సాధించిన ఈ తిరుగులేని విజయాలు..ట్రంప్‌కు ఓ చెంపపెట్టుగా మారాయి. ఎందుకంటే మధ్యంతర ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీపై ఆయన ప్రభావమే ఎక్కువగా ఉంది. దీంతోపాటు దేశంలో ఆర్థిక ఆందోళనలు, ఓటర్ల అసంతృప్తి, మారుతున్న రాజకీయ ప్రాధాన్యతలు రాబోయే అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా ఎన్నికల స్వరూపాన్ని పునర్నిర్మిస్తున్నాయని కూడా ఈ ఫలితాలు సూచిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి.
ఒహియోలో అమీ ఆక్టన్ సంచలన విజయం..20 ఏళ్ల పట్టు కోల్పోయిన రిపబ్లికన్లు
ఒహియోలో డెమోక్రాట్ల తరపున గవర్నర్ గా పోటీ చేసిన 60 ఏళ్ల డాక్టర్ అమీ ఆక్టన్ తన విజయంతో సంచలనం సృష్టించారు. హోరాహోరీగా జరిగిన పోటీలో రిపబ్లికన్ వివేక్ రామస్వామిని ఓడించారు. రామస్వామికి 45 శాతానికి పైగా ఓట్లు రాగా, అమీ ఆక్టన్ 51 శాతం ఓట్లు సాధించారు. ఒహాయోకు గవర్నర్‌గా ఎన్నికైన మొదటి మహిళగా, 20 ఏళ్ల రిపబ్లికన్ల పాలనకు చరమగీతం పాడిన డెమోక్రాట్ గా డాక్టర్ అమీ ఆక్టన్ చారిత్రక విజయం అమెరికన్ రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యతను చాటుకుంది.
ఇటీవలి జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఒహాయో రాష్ట్రం రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపింది. డొనాల్డ్ ట్రంప్ మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసిన సందర్భాల్లో ఈ రాష్ట్రాన్ని గెలుచుకున్నారు. అమెరికాలో ఆర్థిక సమస్యలు, పెరుగుతున్న జీవన వ్యయం,రాష్ట్ర నాయకత్వ పనితీరు చుట్టూ తిరిగిన ఎన్నికల ప్రచారం తర్వాత గవర్నర్ సీటును గెలుచుకోవడం డెమోక్రాట్లకు ప్రత్యేక విజయం.
అయోవాలో.. రెండు దశాబ్దాల రిపబ్లికన్ ఆధిపత్యానికి ముగింపు..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అయోవాలో కూడా కీలక రాజకీయ మార్పు చోటు చేసుకుంది. డెమోక్రాట్ రాబ్ సాండ్, రిపబ్లికన్ జాక్ లాన్‌ను ఓడించి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. గత 20 ఏళ్లలో గవర్నర్ పదవికి ఎన్నికైన మొదటి డెమోక్రాట్‌గా సాండ్ చరిత్ర సృష్టించారు. అయోవాలో రాజకీయ పట్టుకోసం ఆరాటపడుతున్న డెమోక్రాట్లకు ఇది కీలక ముందడుగు.
ఎన్నికల ప్రచారంలో సాండ్ అమెరికన్ ప్రజల కీలక సమస్యలపై దృష్టి సారించారు. ప్రభుత్వ జవాబుదారీతనం, పెరుగుతున్నర ఖర్చులు, రాజకీయ విభేదాలపై ఫోకస్ చేసిన సాండ్ అంతిమంగా విజయం సాధించారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించే నాయకుడిగా ఉంటానన్న హామీతో ప్రజల మనసులను గెలుచుకున్నారు.
గత దశాబ్ద కాలంగా అయోవా రాష్ట్రం రిపబ్లికన్లకు కంచుకోటగా ఉంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇక్కడినుంచి ఈజీగా గెలిచారు. 2006లో చెట్ కల్వర్ అయోవా గవర్నర్ పదవిని గెలుచుకున్న చివరి డెమోక్రాట్. అయితే, 2010లో రిపబ్లికన్ టెర్రీ బ్రాన్‌స్టాడ్ చేతిలో కల్వర్ ఓడిపోయిన తర్వాత రిపబ్లికన్ల ఆధీనంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కొసమెరుపు ఏంటంటే.. పదవీ విరమణ చేస్తున్న గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ 2026లో మరోసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
జార్జియాలో చరిత్ర సృష్టించిన కీషా లాన్స్ బాటమ్స్..
జార్జియాలో డెమోక్రాట్లకు మరో భారీ విజయం లభించింది. డెమోక్రాట్ అభ్యర్థి కీషా లాన్స్ బాటమ్స్, గవర్నర్ ఎన్నికలలో రిపబ్లికన్ రిక్ జాక్సన్‌ను ఓడించారు. అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతి మహిళగా బాటమ్స్ చరిత్ర సృష్టించారు. బాటమ్స్ విజయంతో జార్జియా గవర్నర్ పదవిపై రిపబ్లికన్ పార్టీకి ఉన్న 28 ఏళ్ల పట్టుకు తెరపడింది. 1998లో జార్జియాలో 53 శాతం ఓట్లలో గవర్నర్ పదవిని గెలుచుకున్న చివరి డెమోక్రాట్ రాయ్ బార్న్స్. ఆ తర్వాత జార్జియాలో రిపబ్లికన్ల చేతిలోకి వెళ్లిపోయింది.
ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి అయిన జాక్సన్ వ్యాపారవేత్త.. ప్రచారం కోసం జాక్సన్ 200 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు సమాచారం. అయినా డెమోక్రాట్ అభ్యర్థి బాటమ్స్ తట్టుకొని నిర్ణయాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇది డెమోక్రటిక్ ప్రచారం బలాన్ని నొక్కి చెబుతోంది.
టెక్సాస్ లో.. 36 ఏళ్ల రిపబ్లికన్ల పాలనకు తెర..
డెమోక్రాట్లు గెలుచుకున్న కీలకమైన నాలుగు రాష్ట్రాల్లో అత్యంత రాజకీయ ప్రాముఖ్యత ఉన్న టెక్సాస్ ఒకటి. ప్రస్తుత రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్‌ను డెమొక్రాట్ గినా హినోజోసా ఓడించి రిపబ్లికన్ల కంచుకోటలలో ఒకటైన టెక్నాస్ గవర్నర్ పీఠాన్ని దక్కించుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా కొనసాగిన రిపబ్లికన్ల ఆధిపత్యానికి ఆమె తెరదించారు. 52 శాతానికి పైగా ఓట్లు సాధించి అబాట్‌ను హినోజోసా ఓడించి, నాలుగోసారి గవర్నర్ అవుదామనుకున్న ఆయన ప్రయత్నానికి ముగింపు పలికారు.
గినా విజయం చారిత్రాత్మకమైనది. జనవరి 2027లో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న గినా.. టెక్సాస్‌కు మొట్టమొదటి లాటినా గవర్నర్‌గా, ఆన్ రిచర్డ్స్ తర్వాత ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి డెమొక్రాట్‌గా నిలుస్తారు. 1995 లో టెక్సాస్ డెమోక్రాట్ గవర్నర్ రిచర్డ్స్ ఓటమి తర్వాత రిపబ్లికన్ల హవా కొనసాగుతోంది. గినా హినోజోసా గెలుపు తో 36 ఏళ్ల తర్వాత డెమోక్రాట్లు సాధించిన విజయం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
