‘ప్రాణంతో ఉన్నానని తెలిపే పరికరమొకటే నాకు పాట..’ అంటూ ‘గరివిడి లక్ష్మి’ చిత్రం పాటలోని సాహిత్యం తన జీవన ప్రయాణానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పారు సింగర్ వీహా. ఇటీవల విడుదలైన ఈ చిత్రంతో ఓ గాయనిగా తనకు దక్కిన గౌరవం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మారెడ్డిపల్లెకు చెందిన తాను.. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా సింగర్‌గా నిరూపించుకునేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా పదేళ్లుగా ప్రయత్నాలు చేశానని ఆమె చెప్పారు.
గత మూడేళ్లుగా ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించి ఏకంగా 17 ట్రాక్ పాటలను పాడానని, తను ట్రాక్ పాడిన పాటలను అనన్య భట్ పాడే సమయంలోనూ ఆ పాటల నాణ్యతకు కృషి చేశానని ఆమె చెప్పారు. ఈ సినిమాకు ప్రాణంగా నిలిచిన ‘ఉలుకు పలుకు’, ‘నీ నీడ’ లాంటి పాటలకు తన గాత్రంతో జీవం పోసి దర్శకుడు, సంగీత దర్శకుడి నమ్మకాన్ని వీహా నిలబెట్టుకున్నారు.
సుద్దాల అశోక్ తేజ అందించిన భావోద్వేగ సాహిత్యానికి తన గొంతుతో అద్భుతమైన న్యాయం చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాటలను మొదట ప్రముఖ గాయని కేఎస్ చిత్రతో పాడించాలనుకున్నారు. అయితే రికార్డింగ్, చిత్రీకరణ దశల నుంచి తాను పడిన కష్టం, ఆరాటాన్ని గుర్తించిన దర్శకనిర్మాతలు ఆ బాధ్యతను తనకే అప్పగించారని వీహా తెలియజేశారు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ దక్కడం పట్ల వీహ సంతోషం వ్యక్తం చేశారు.
