హైదరాబాద్‌లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు బంద్‌కు పిలుపునిచ్చారు. రెవెన్యూ, హైడ్రా అధికారులు అనుసరిస్తున్న విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రోడ్లపైకి వస్తున్న ఇతర ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను అడ్డుకుని, వాటిలోని వేల లీటర్ల నీటిని రోడ్లపైనే పారబోస్తూ నిరసన తెలిపారు.
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ బోర్లను అక్రమ బోర్లుగా పేర్కొంటూ హైడ్రా అధికారులు తొలగిస్తున్నారని ఆరోపించారు. దీంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని, రెవెన్యూ, హైడ్రా శాఖల విధానాల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు.
నగరంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానుల బంద్ నేపథ్యంలో ఈరోజు ఎలాంటి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు రోడ్లపైకి రావద్దని సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. బంద్‌కు సహకరించాలని ట్యాంకర్ల యజమానులను కోరారు.
మరోవైపు, గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర పరిధిలోని అక్రమ బోర్లపై హైడ్రా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా చెరువుల సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్లను గుర్తించి తొలగిస్తున్నారు. ఈ చర్యలే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానుల ఆందోళనకు ప్రధాన కారణంగా మారాయి.
అయితే, తమ నిరసనలో భాగంగా ఇతర ట్యాంకర్లను అడ్డుకుని నీటిని రోడ్లపై పారబోయడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలా వేల లీటర్ల నీటిని వృథా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
