Good Health: సప్లిమెంట్లు అంటే మందులు కావు కదా.. ఆరోగ్యం కోసం రోజూ వేసుకోవచ్చా..?

Good Health: సప్లిమెంట్లు అంటే మందులు కావు కదా.. ఆరోగ్యం కోసం  రోజూ వేసుకోవచ్చా..?

హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. మన శరీరంలో లోపించిన మూలకాలు, విటమిన్ల నేరుగా అందించే పదార్థాలు. విటమిన్ డి క్యాప్సూల్స్, మల్టీ విటమిన్లు, ప్రోటీన్ పౌడర్లు అంటూ చాలా ఉంటాయి. సోషల్ మీడియాలో వీటి గురించే ప్రచారం.. ఫార్మసీ స్టోర్లలో ఎక్కడ చూసినా హెల్త్ సప్లిమెంట్లతో ర్యాకులు నిండి ఉంటాయి. జిమ్ కు వెళ్లే వాళ్లు అయితే రెగ్యులర్ గా వాడుతుంటారు. ప్రస్తుత ఉన్న ప్రచారంతో చాలా మంది సప్లిమెంట్స్ తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటున్నారు. అయితే ఇవి నిజంగా రోజూ అవసరమా..? మంచి ఆరోగ్యం కోసం రోజూ తీసుకోవచ్చా..? దీని గురించి డాక్టర్లు ఏమంటున్నారో చూద్దాం.

మెరుగైన ఆరోగ్యం, బలమైన రోగనిరోధక శక్తి, ఎక్కువ ఎనర్జీ, మంచి హెల్త్ కోసం సప్లిమెంట్లు తీసుకోవాలనే ప్రచారంలో ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయో డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు.  రోజూ వేసుకోవచ్చా లేదా అని విషయాలు వెల్లడించారు.  చాలా మంది ఆరోగ్యవంతులు సమతుల్య ఆహారం దీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. అవసరం లేకుండా రోజూ అనేక సప్లిమెంట్లు తీసుకోవడం కరెక్ట్ కాదని, కొన్నిసార్లు హానికరం కూడా కావచ్చునని హెచ్చరిస్తున్నారు. 

సమతుల ఆహారం చాలు:

ఫోర్టిస్ సి-డాక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటిస్ చైర్మన్, పద్మశ్రీ డా. అనూప్ మిశ్రా మాట్లాడుతూ.. తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, నట్స్, పాల ఉత్పత్తులు, తగినంత ప్రొటీన్ ఉన్న సమతుల్య స్థానికంగా తీసుకునే ఆహారం చాలా పోషక అవసరాలను తీర్చగలదని తెలిపారు. చాలా మంది ఆరోగ్యవంతులకు రోజువారీ సప్లిమెంట్లు అవసరం లేదన్నారు.

అయితే విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్, కాల్షియం లోపాలు కొంత మందిలో ముఖ్యంగా శాకాహారుల్లో ఇవి అవసరం అవుతాయని చెప్పారు.  సప్లిమెంట్లు తీసుకోవాలంటే ఆహార అలవాట్లు, వయసు, లైఫ్ స్టైల్, ఆరోగ్య పరిస్థితులు, రక్త పరీక్షల ఆధారంగా నిర్ణయించాలని సూచించారు.

ప్రతి ఒక్కరికీ మల్టీవిటమిన్ అవసరం లేదు

బాగా ప్లాన్ చేసిన స్థానిక ఆహారం (ధాన్యాలు, మిల్లెట్స్, పప్పులు, పాలు/పెరుగు, కూరగాయలు, పండ్లు, నట్స్, అవసరమైతే గుడ్లు/మాంసం) దాదాపు అన్ని పోషకాలను అందిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ 2024 గైడ్‌లైన్స్ కూడా ఆహారం ద్వారానే పోషకాలు తీసుకోవాలని, అనవసర ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోకూడదని చెబుతున్నాయి.

అయితే విటమిన్ డి, విటమిన్ బి12 లోపాలు ఇండియాలో చాలా సాధారణం అని అంటున్నారు. ముఖ్యంగా శాకాహారుల్లో బి12 లోపం ఉంటుందని తెలిపారు. గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, వృద్ధులకు కాల్షియం అవసరం కావచ్చు. కానీ ఇవి టెస్టులు చేయకుండా, డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదని తెలిపారు.  యాడ్స్, సోషల్ మీడియా చూసి వినియోగించడం ప్రమాదకరం అని  హెచ్చరిస్తున్నారు. 

సప్లిమెంట్లు ఎప్పుడు  అవసరం?

శాకాహారులు లేదా వీగన్లకు విటమిన్ బి12 లోపం ఉన్నవారు తీసుకోవచ్చు. గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. సూర్యరశ్మి తక్కువగా పడేవారికి, కొన్ని వ్యాధులున్నవారికి విటమిన్ డి అవసరం అవుతుంది. వృద్ధులు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా సప్లిమెంట్స్ అవసరం పడతాయి. అయితే వీటికి డాక్టర్ సలహా తప్పనిసరి అని చెబుతున్నారు. 

 అలసట, బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలను వెంటనే విటమిన్ లోపంగా భావించకూడదు. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సప్లిమెంట్ అంటే లోపం ఉన్నప్పుడు సరిచేయడానికి. ఇది రోజువారీ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, చెడు ఆహారం స్థానంలో తీసుకునేది కూడా కాదు డాక్టర్లు చెబుతున్నారు. సప్లింమెంట్లు ఎక్కువ తీసుకున్నా కూడా కొన్ని విటమిన్లు, మినరల్స్ శరీరానికి హాని చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.