Suryakumar Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (IPL 2027) వేలానికి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చేలా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ ఇండియా కెప్టెన్, మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగుతాననే హింట్‌ను స్పష్టంగా ఇచ్చేశాడు. ఈరోజు (2026, నవంబర్ 3, మంగళవారం) సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ముంబై లోగోతో ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్:
సూర్యకుమార్ యాదవ్ షేర్ చేసిన ఆ వీడియోలో ముంబై ఇండియన్స్ లోగో కనిపిస్తుండగా, ఐపీఎల్ పాపులర్ థీమ్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అదరగొడుతున్న విజువల్స్ ఆ వీడియోలో ఉన్నాయి. ఈ పోస్ట్ అఫీషియల్ రిటెన్షన్ అనౌన్స్‌మెంట్ కాకపోయినప్పటికీ.. సూర్య ముంబై జట్టును వీడే ప్రసక్తే లేదంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఇతర ఫ్రాంచైజీల నుంచి భారీ ఆఫర్లు.. ఎల్ఎస్‌జీ, కేకేఆర్ రేసులో:
కొద్ది రోజులుగా సూర్యకుమార్ ముంబై ఇండియన్స్‌ను వీడుతున్నాడంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు సూర్యను దక్కించుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. లక్నో జట్టు సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు ఆసక్తి చూపగా.. నికోలస్ పూరన్‌తో స్వ్యాప్ డీల్ ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు 2018కి ముందు తాను ప్రాతినిధ్యం వహించిన కేకేఆర్ కూడా సూర్యను వెనక్కి రప్పించాలని చూసినట్లు పలు నివేదికలు వచ్చాయి.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై కూడా సస్పెన్స్:
సూర్యకుమార్ యాదవ్ భవితవ్యంతో పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ రూమర్స్ నడుమ.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. యువ ఆటగాడు తిలక్ వర్మ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. టీ20ల్లో టీమిండియాను విజయవంతంగా నడిపించిన సూర్యకుమార్ పేరును కూడా ఫ్రాంచైజీ పరిశీలించే ఛాన్స్ ఉంది. కానీ ముంబై మేనేజ్‌మెంట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు.
ముంబై ఇండియన్స్ లెజెండ్‌గా సూర్య రికార్డులు:
2018లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరినప్పటి నుంచి సూర్య ఆ ఫ్రాంచైజీకి కొండంత బలంగా నిలిచాడు. ఐపీఎల్‌లో కేకేఆర్, ముంబై తరఫున మొత్తం 179 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్.. 33.68 యావరేజ్, 148.58 స్ట్రైక్ రేట్‌తో 4,581 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆయన సీజన్లవారీగా చేసిన పరుగులు అద్భుతం: 2025లో 717 పరుగులు, 2023లో 605 పరుగులు, 2018లో 512 పరుగులు చేశాడు. ముంబై తరఫున అన్ని టీ20 మ్యాచ్‌లు కలిపి 127 మ్యాచ్‌ల్లో 4,020 పరుగులు (2 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు) సాధించి.. రోహిత్ శర్మ (6,432 పరుగులు) తర్వాత ఆల్-టైమ్ రికార్డులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
Latest instagram post of Suryakumar Yadav So he is getting retained by MI 👀 https://t.co/IFK403IdAE
— 𝑪𝒉𝒂𝒓𝒂𝒏𝑪𝒓𝒖𝒛 (@Charan7SK) November 3, 2026
