'లెజెండ్' సినిమా గురించి రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్.. బాలయ్య ఫ్యాన్స్ ఫైర్!

'లెజెండ్' సినిమా గురించి రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్.. బాలయ్య ఫ్యాన్స్ ఫైర్!

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసి, ఆ తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏకంగా నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో చర్చకు దారితీశాయి. తెలుగులో తాను నటించిన ఓ సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాధికా ఆప్టే కెరీర్ ప్రారంభంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'లెజెండ్' (2014)లో కథానాయికగా నటించారు. ఆ తర్వాత బాలయ్యతోనే 'లయన్' సినిమాలోనూ కనిపించారు. అయితే లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ తన గత సినిమా అనుభవాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

'అక్క' వెబ్‌సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో అత్యంత కష్టమైన పాత్ర గురించి రాధికా మాట్లాడారు. ఓ తెలుగు సినిమాలో తనకంటే చాలా పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. కథలో మేనరికపు వివాహం నేపథ్యం ఉందని చెప్పారు. అంతేకాదు, సినిమా సగంలోనే తన పాత్ర చనిపోతుందని, ఆ తర్వాత హీరో తన మృతదేహాన్ని భుజాన వేసుకుని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందని గుర్తుచేసుకున్నారు. ఈ మొత్తం అనుభవం తనకు ఏమాత్రం నచ్చలేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ వివరాలన్నీ 'లెజెండ్' సినిమాకే సరిపోతుండటంతో చర్చ మొదలైంది. 2014లో ఈ సినిమా విడుదలైనప్పుడు బాలకృష్ణ వయసు 54 ఏళ్లు కాగా, రాధిక వయసు 29 ఏళ్లు.

అయితే రాథిక ఆప్టే వ్యాఖ్యలపై నెటిజన్లు, బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కథ నచ్చకపోతే అప్పుడే సినిమా ఎందుకు అంగీకరించారని కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. నటీనటులకు తమ గత అనుభవాలపై ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉందని మరికొందరు సమర్థిస్తున్నారు. పైగా 'లెజెండ్' తర్వాత 2015లో 'లయన్' సినిమాలోనూ బాలయ్యతో రాధిక నటించడాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. 

ALSO READ : రామాయణ సాంగ్స్పై విమర్శలు.. ‘అందరికీ నచ్చాలంటే ఐస్‌క్రీమ్ అమ్మాలి’

మరోవైపు ఈ వివాదం కేవలం ఒక సినిమా పాత్రతో ఆగకుండా తెలుగు సినిమాల్లో వయసు అంతరాలు, మహిళా పాత్రల ప్రాధాన్యత, పితృస్వామ్య ధోరణులపై కొత్త చర్చకు తెరలేపింది. కీర్తి సురేష్‌తో కలిసి రాధిక నటించిన 'అక్క' సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాని ప్రమోషన్ల సందర్భంగా రాధిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ చర్చకు దారితీసింది.