దత్తత వివాదం: అమ్మా నాన్న.. నన్ను తీసుకెళ్లండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న చిన్నారి వీడియో !

దత్తత వివాదం: అమ్మా నాన్న.. నన్ను  తీసుకెళ్లండి..  కన్నీళ్లు పెట్టిస్తున్న చిన్నారి వీడియో !

కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది అనటానికి ఇదే నిదర్శనం. ఏ తల్లి కడుపు నుంచి పుట్టినా.. కంటికి కనిపిస్తూ ఆలనా పాలనా చూస్తూ.. ప్రేమగా పెంచే వాళ్లనే తల్లిదండ్రులుగా భావిస్తూ వస్తారు పిల్లలు. నువ్వు మా కడుపున పుట్టలేదు అని చెబితే కానీ వాళ్లకు తెలియదు.. అందుకే అంటారు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని.. అలాంటి ఉదాహరణకు ఈ వీడియోనే ప్రత్యక్ష నిదర్శనం.

 దత్తత విషయంలో తలెత్తిన వివాదంతో.. మూడేళ్ల చిన్నారిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంచారు అధికారులు. కోర్టు తీర్పు ఉన్నా పిల్లోడిని అప్పగించలేదంటూ ఆ తల్లిదండ్రులు బయటకు వచ్చారు. మూడేళ్ల కొడుకును చూడ్డానికి శిశు సంరక్షణ కేంద్రానికి వెళ్లగా.. అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లండి అంటూ ఆ పిల్లోడు చేసిన మారాం.. ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది. ఈ వీడియో వెనక కన్నీటి కథ తెలుసుకుందామా..

 ఈ హృదయవిదారక ఘటనజగిత్యాల జిల్లాలో  జరిగింది. తమకు పిల్లలు లేకపోవడంతో ఒక శిశువును మూడేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు సరిత-శ్రీనివాస్ దంపతులు. తల్లి చనిపోయిన ఐదు రోజులకే దత్తత తీసుకుని ఆలనా పాలనా చూసుకుంటూ కన్నబిడ్డకంటే ఎక్కువగా చూసుకున్నారు. దీంతో పేగుబంధానికి మించిన అనుబంధం ఆ తల్లిదండ్రులతో ఆ బాబుకు ఏర్పడింది. ప్రస్తుతం ఆ బాబు వయసు మూడేళ్లు. 

అయితే మూడేళ్ల తర్వాత దత్తత చెల్లదని అధికారులు ఆ దంపతులకు షాకిచ్చారు.  చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. 

పెంచిన ప్రేమ, కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్న అనుబంధం ఆ తల్లిదండ్రులను ఉండనివ్వలేదు. తమ బిడ్డను చూసేందుకు  శిశు సంక్షేమ కేంద్రానికి  వెళ్లగా, నేనిక్కడ ఉండలేను..
నన్ను తీసుకెళ్లండి అమ్మానాన్నా.. భయమేస్తుంది.. అనేలా  గుండెలవిసేలా చిన్నారి రోధించడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. బాబును గుండెలకు హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు ఆ దంపతులు.

తాము హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని ఆ దంపతులు చెబుతున్నారు. ఇదే విషయంపై హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని 2026 అక్టోబర్ 16వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. 

అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని సరిత-శ్రీనివాస్ దంపుతులు ఆరోపిస్తున్నారు. తమపై బెంగతో క్లినిక్ లో ఉండలేక.. తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆవేదన చెందుతున్నారు. వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలు కని చెత్తకుప్పల్లో పడేసే వ్యక్తులున్న ఈ రోజుల్లో.. మూడేండ్లుగా పెంచిన తల్లిదండ్రుల నుంచి బిడ్డను దూరం చేయడం సబబేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు చెప్పినా బాబును అప్పగించకపోవడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దత్తత చట్ట ప్రకారం తీసుకోలేదని చెప్పే అధికారులు.. ఆ చట్టపరమైన ఫార్మాలిటీస్ ఏంటో పూర్తి చేసి  బాబును అప్పగించవచ్చు కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.