అనంతపురం: రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. హేమంత్పై పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. నిందితుడు హేమంత్ పోలీసులపై రాళ్ల దాడి చేసి పారిపోయేందుకు యత్నించడంతో ఆత్మ రక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లుపై నిందితుడు కత్తితో దాడి చేశాడని.. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపారని తెలిసింది. ఈ కాల్పుల్లో నిందితుడు హేమంత్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.
ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగిన సంగతి తెలిసిందే. రాప్తాడు మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది( 21) మొద్దులు కోసే రంపం మిషన్‌తో దాడి చేశాడు. నేరుగా స్కూల్లోకి వచ్చిన నిందితుడు.. తరగతి గదిలోనే పిల్లలందరితో పాటు టీచర్ చూస్తుండగానే ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడికి తెగపడ్డాడు.
ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అటాక్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం దాడికి ఉపయోగించిన రంపం మెషీన్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితుడిని ధర్మవరం మండలానికి చెందిన హేమంత్ గా పోలీసులు గుర్తించారు. ‘‘పిల్లలకు మ్యాథ్స్ చెబుతుంటే ఓ దుండగుడు క్లాస్ లోకి వచ్చాడు. నేరుగా అమ్మాయి వద్దకు వెళ్లి రంపంతో చేశాడు. నేను షాక్‌లోకి వెళ్లిపోయా. ఏం జరుగుతోందో అర్థం కాలేదు’’ అని క్లాస్ టీచర్ పేర్కొన్నారు.
