ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో టెన్షన్ టెన్షన్

ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో టెన్షన్ టెన్షన్

కడప: పులివెందులలో మున్సిపల్ ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. 70 మంది YSRCP ఏజెంట్లతో కలిసి ఆర్వో ఆఫీస్ ముందు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ ఏజెంట్లను అడ్డుకోవడంపై ఎన్నికల సంఘం అధికారులను జగన్ నిలదీశారు. ఎన్నికల్లో అక్రమాలపై వైసీపీ నేతలతో కలిసి జగన్ ఆందోళనకు దిగారు. దీంతో.. పులివెందులలో టెన్షన్ వాతావరణం కనిపించింది.

పులివెందులలో ఓటు వేయకుండానే జగన్ వెనుదిరిగి వెళ్లిపోయారు. తాను ఓటు వేయనని.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిస్థితులు ప్రజలకు తెలియాలని జగన్ చెప్పారు. తాను ఓటు వేసి వెళ్లి పోతే అంతా సవ్యంగానే ఉందనే భ్రమ కలిగిస్తారని, కానీ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితులు ఎంత మాత్రం లేవని జగన్ మండిపడ్డారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరును జగన్ తప్పుబట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సహా అధికారులంతా సీఎం చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలుగా మారారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిన జగన్, అప్పుడొచ్చి మాత్రమే ఓటేస్తానని తేల్చి చెప్పారు. టీడీపీ అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 40.03 శాతం పోలింగ్ నమోదైంది.