ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని పులివెందుల వీధుల్లో వైఎస్ జగన్ ర్యాలీ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీగా వెళ్తున్న సమయంలో వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి దస్తగిరి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
జగన్ ర్యాలీ కొనసాగుతున్న సమయంలో దస్తగిరి అక్కడికి వచ్చినట్లు వైసీపీ కార్యకర్తలు జగన్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో దస్తగిరి ర్యాలీకి ఎదురుగా వెళ్లి జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.‘సొంత బాబాయ్‌ను చంపించావు.. మా జీవితాలను నాశనం చేశావు’ అంటూ దస్తగిరి వ్యాఖ్యలు చేశాడు.
వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దస్తగిరి జగన్ ర్యాలీకి ఎదురుగా వెళ్లడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయనను అడ్డుకుని పక్కకు పంపించారు. మరోవైపు దస్తగిరి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో జగన్ మాత్రం స్పందించకుండా ర్యాలీని కొనసాగించారు.
