Gautam Gambhir: భారత క్రికెట్ జట్టులో ప్లేయర్ల ఎంపికపై బయట జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. జట్టును నడిపించడంలో అందరినీ సంతోషపరచడం కంటే, జట్టు ప్రయోజనాల కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడమే తన మొదటి ప్రాధాన్యమని తేల్చి చెప్పాడు. జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో పాటు సుదీర్ఘకాలంగా రాణిస్తున్న సీనియర్లు ఉన్న నేపథ్యంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
పాపులర్ నిర్ణయాలు వేరు.. సరైన నిర్ణయాలు వేరు: గంభీర్
* క్రెక్బజ్ (Cricbuzz) ఇంటర్వ్యూలో టీమిండియా సెలక్షన్ ఫిలాసఫీ గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. మొదటిగా చెప్పాలంటే ప్రతీ ఒక్కరినీ సంతోషపరచడం నా పని కాదు.. అందరూ మెచ్చే నిర్ణయాలు (పాపులర్ నిర్ణయాలు) తీసుకోవడం కంటే, జట్టుకు ఏది సరైనదో ఆ సరైన నిర్ణయాలు తీసుకోవడమే నా బాధ్యత.. అందుకే నేను ఇక్కడ ఉన్నానన్నారు.
* సోషల్ మీడియా ప్రభావంపై స్పందిస్తూ: ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తులు మెచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువు.. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లకు భద్రతభావం కల్పించడం, జట్టుకు మేలు చేసే కఠిన నిర్ణయాలు తీసుకోవడమే నాకు ముఖ్యం అని గంభీర్ స్పష్టం చేశాడు.
సుదీర్ఘకాలం రాణించిన వారికి ప్రాధాన్యం:
* జట్టులో సీనియర్లు, వైభవ్ సూర్యవంశీ లాంటి యంగ్ సంచలనాలు, సంజు శాంసన్, అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ప్లేయర్లు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తుందని గంభీర్ తెలిపాడు.
సుదీర్ఘ అవకాశం (Longer Rope): చాలా కాలంగా జట్టు కోసం అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు కొన్నిసార్లు విఫలమైన కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పాడు.
జట్టులో భద్రత: ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో భద్రత లేకపోతే వారు స్వేచ్ఛగా ఆడలేరని, అందుకే ఒకటీ రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఎవరినీ పక్కనబెట్టమని గంభీర్ క్లారిటీ ఇచ్చాడు.
