India vs New Zealand: హమిల్టన్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చివరి టీ20 (5th T20I) మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది. ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడినా మొదట బ్యాటింగ్ చేస్తూ తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని భావించినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 3–1తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరి మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 4–1తో ఘనంగా ముగించాలని పట్టుదలతో ఉంది.
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. ఈసారి కూడా నేను టాస్ ఓడిపోతానేమోనని అనుకున్నాను.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం.. ఇది సరికొత్త పిచ్, మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ మైదానంలో మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ మైదాన బౌండరీ కొలతలకు బౌలర్లు త్వరగా అలవాటు పడాలి.. ఈడెన్ పార్క్ తరహాలోనే ఇక్కడ కూడా కొంత బౌన్స్ లభిస్తే సీమర్లకు మేలు జరుగుతుంది. ఈ సిరీస్ మొత్తంలో మా బ్యాటింగ్ చాలా బాగుంది.. గత మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు కూడా అనుకూలించడం కలిసొచ్చింది.. ఈ మ్యాచ్ కోసం మేము జట్టులో ఒక్క మార్పు చేశాం.. బ్లేర్ టిక్నర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడని శాంట్నర్ వెల్లడించాడు.
భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక మైదానంలో ఆడటం చాలా సంతోషంగా ఉంది. టాస్ గెలిచినా మేము ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలని అనుకున్నాం.. వికెట్‌పై ముందుగా బ్యాటింగ్ చేసి మా సత్తాను పరీక్షించుకోవాలనుకున్నాం.. ఆక్లాండ్‌లో స్టేడియం కొలతలు (Dimensions) పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కానీ న్యూజిలాండ్‌ను మెచ్చుకోవాలి, ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ గత మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.. ఈ మ్యాచ్ కోసం మేము తుది జట్టులో రెండు మార్పులు చేశాం.. వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చారు. భువీ తన ఛాన్స్ కోసం ఎంతగానో వేచి చూశాడు.. ఈరోజే మ్యాచ్‌కు ముందు జట్టు హడల్‌లో (Team Huddle) కూడా అతను అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడని శ్రేయస్ పేర్కొన్నాడు.
ఇరు జట్లు:
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్
భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
