ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. రామ్‌లీలా మైదానంలో కిక్కిరిసిన జనం

ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. రామ్‌లీలా మైదానంలో కిక్కిరిసిన జనం

ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిర్వహిస్తున్న మెగా ర్యాలీ ప్రారంభమైంది. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఓట్ల చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్, కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే రామ్‌లీలా మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. మైదానానికి వెళ్లే రహదారులన్నీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలతో సందడిగా మారాయి. కొందరు డోలు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ర్యాలీ ప్రాంగణం వైపు కదిలారు. మరికొందరు నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

‘ఓటును కాపాడండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో ఇండియా కూటమి ఈ ర్యాలీని నిర్వహిస్తోంది. ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజల గొంతు వినిపించడమే లక్ష్యమని కూటమి నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా పలువురు నేతలు విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వివిధ ప్రాంతాలను దేశ రాజధానికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు  కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల నుంచి గుంపులుగా రామ్‌లీలా మైదాన్ వైపు కదిలారు. హర్యానా సహా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. దీంతో ఢిల్లీలోని పలు రహదారులపై రద్దీ పెరిగింది.

జ్ణానేష్  కుమార్ రాజీనామా చేయాలని, ఓట్ చోర్ చేసే వారిని నుంచి దేశాన్ని కాపాడాలని  డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నిర్వహిస్తున్న ఈ ర్యాలీతో ఢిల్లీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటు హక్కు పరిరక్షణ పేరుతో సాగుతున్న ఈ ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

అఖిలేశ్ యాదవ్ ..

ఉత్తరప్రదేశ్‌లో ఓట్ల గల్లంతుపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. యూపీ సీఎం యోగి స్వయంగా 1.27 కోట్ల ఓట్లు కనిపించడం లేదని అంగీకరించారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాతే ఈ విషయం గుర్తొచ్చిందని విమర్శించారు. ఒకప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పుకున్నవారు ఇప్పుడు  డబుల్ జీరోగా మారారని ఎద్దేవా చేశారు. ఒక ఎన్నికలో ఓటమి ఎదురైన తర్వాత రీకౌంటింగ్ కోరడం ఏమిటని ప్రశ్నించారు. 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని ఇప్పుడు చెబుతున్నారు.. ఈ వివరాలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. లక్షలాది మంది లబ్ధిదారుల ఓట్లు కనిపించడం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు, వారంతా కూడా రామ్‌లీలా మైదానానికి రావాలని సూచించారు. 

 

 

శశి థరూర్ వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎన్నికల ఓటర్ల జాబితాపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎలాంటి తప్పులు లేని సమగ్ర ఓటర్ల జాబితా ఉండాలని అన్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు ఒకట్రెండు ఉండటం కంటే, నిజమైన ఓటర్ల పేర్లను కోట్ల సంఖ్యలో తొలగించడం చాలా తీవ్రమైన విషయమని అన్నారు. 

ఎన్నికల సంఘం ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తుందన్నారు శశి థరూర్.గత 80 ఏళ్లుగా దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగాయని గుర్తుచేశారు. ఇప్పుడు 13 కోట్ల మంది నిజమైన ఓటర్ల పేర్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఇండియా కూటమి నేతలంతా ర్యాలీలో పాల్గొంటున్నారని తెలిపారు.