జస్ట్ 3.5 గంటల్లోనే ఢిల్లీ టూ వారణాసి.. యూపీ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‎కు కేంద్రం ఆమోదం

జస్ట్ 3.5 గంటల్లోనే ఢిల్లీ టూ వారణాసి.. యూపీ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‎కు కేంద్రం ఆమోదం

లక్నో: ఉత్తరప్రదేశ్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య నార్తర్న్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం (అక్టోబర్ 31) ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీ నార్తర్న్ బుల్లెట్ రైలు కారిడార్‌కు ఆమోదం తెలిపారని చెప్పారు. తద్వారా బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ఇండియా ఒక కీలక ముందడుగు వేసిందన్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణ సమయం కేవలం 3.5 గంటలకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ టూ వారణాసికి ట్రైన్‎లో 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. 

జస్ట్ 3.5 గంటల్లోనే ఢిల్లీ టూ వారణాసి

‘‘బుల్లెట్ రైలుతో ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గుతాయి. ఢిల్లీ నుండి కాన్పూర్‌కు 1 గంట 45 నిమిషాలు, ఢిల్లీ నుండి ఆగ్రాకు 59 నిమిషాలు, ఢిల్లీ నుండి లక్నోకు 2 గంటల 12 నిమిషాలు, వారణాసి నుండి లక్నోకు 1 గంట 21 నిమిషాలు, వారణాసి నుండి పాట్నాకు గంట, వారణాసి నుండి ఢిల్లీకి 3 గంటల 33 నిమిషాలు, వారణాసి నుండి ప్రయాగ్‌రాజ్‌కు 33 నిమిషాలు, వారణాసి నుండి ఆగ్రాకు 2 గంటల 34 నిమిషాలు’’ పడుతుందని ఆయన తెలిపారు. 

విమాన చార్జీల కంటే తక్కువ 

హై-స్పీడ్ రైలు సర్వీసులు కేవలం ధనిక ప్రయాణికుల కోసమేననే అభిప్రాయాన్ని కొందరు సృష్టించేందుకు ప్రయత్నించవచ్చని అన్నారు. కానీ బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు విమాన ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయని తెలిపారు.  మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు ఉంటాయని.. తద్వారా ప్రయాణికులకు హై-స్పీడ్ రైలు ప్రయాణం మరింత అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలు రైతులు, మధ్యతరగతి ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు కూడా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉన్నాయని స్పష్టం చేశారు.


►ALSO READ | దీపావళి ఆఫర్ల పేరుతో భారీ మోసాలు.. ఫేక్ షాపింగ్ యాప్‌లతో జాగ్రత్త!