దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఆన్‌లైన్ షాపింగ్లో రకరకాల ఆఫర్లు సందడి చేస్తుంటాయి. భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు, తక్కువ ధరకే ఖరీదైన వస్తువులు అంటూ ప్రకటనలు కనిపిస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని నిజమైన ఆఫర్లు కాగా, మరికొన్ని సైబర్ నేరగాళ్లు వేసే మోసపు వలలు. ముఖ్యంగా ప్రముఖ షాపింగ్ యాప్స్ పేరుతో నకిలీ యాప్స్ తయారు చేసి, ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందుకే పండుగ ఆఫర్లు చూసి వెంటనే కొనే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చూసి
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కు చెందిన అమిత్ కుమార్ మిశ్రా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఒకరోజు తనకు తెలిసిన వ్యక్తి పంపిన ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పటివరకు చూడనంత భారీ డిస్కౌంట్ ఉండటంతో వెంటనే కొనాలని అనుకుకున్నాడు. అయితే ఆ ఆఫర్ నిజమైన ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోనిది కాదు. నకిలీ యాప్‌లో కనిపించిన ప్రకటన. ఆ విషయాన్ని గుర్తించకుండానే తన ఫోన్‌లో పేమెంట్ బటన్ నొక్కడంతో మోసానికి గురయ్యాడు.
రూ.499కే మూడు ప్రెషర్ కుక్కర్లు..
నోయిడాలో ఓ వృద్ధురాలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండగా ఒక ప్రకటన కనిపించింది. మూడు స్టీల్ ప్రెషర్ కుక్కర్లు కేవలం రూ.499కే ఇస్తామనేది ప్రకటన. అంత తక్కువ ధర చూసి ఆశ్చర్యపోయిన ఆమె, తన ఇంట్లో పనిచేసే పనిమనిషికి దీపావళి కానుకగా వాటిని కొనివ్వాలని అనుకుంది. అయితే ఆ ఆఫర్ గురించి తన కూతురికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. అది నకిలీ ప్రకటన అని ఆమె కూతురు గుర్తించి వెంటనే తల్లిని మోసం బారిన పడకుండా కాపాడింది.
అసలైన యాప్‌లాగే నకిలీ యాప్స్
ఈ రెండు ఘటనల్లోనూ మోసగాళ్లు వల వేసిన నకిలీ యాప్‌లే ప్రధాన కారణం. చూడటానికి అవి అసలైన షాపింగ్ యాప్‌లాగానే ఉంటాయి. బ్రాండ్ లోగోలు, డిజైన్లు కూడా అలాగే కనిపిస్తాయి. కానీ పేరులో మాత్రం చిన్న మార్పులు చేస్తారు.
ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో దాదాపు 25 నకిలీ మీషో యాప్స్, రెండు నకిలీ యాప్స్ బయటపడ్డాయి. నకిలీ ఫ్లిప్‌కార్ట్ యాప్‌లకు 'ఫ్లాపార్ట్', 'ఫ్లాక్సార్ట్' వంటి పేర్లు పెట్టారు. అందుకే యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు దాని పేరు, డెవలపర్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలి.
భారీ డిస్కౌంట్లు కనిపిస్తే వెంటనే నమ్మొద్దు
మార్కెట్‌లో లక్షల రూపాయలు విలువ చేసే ఐఫోన్‌ను రూ.699కే ఇస్తామన్నా, ఖరీదైన షూస్‌ను రూ.399కే అందిస్తామన్నా ఒకసారి ఆలోచించాలి. సాధారణ ధరతో పోలిస్తే 80 నుంచి 90 శాతం తగ్గింపు కనిపిస్తే అది నిజమైన ఆఫరేనా అని పరిశీలించాలి.
నమ్మలేనంతగా తక్కువ ధరకు వస్తువులు ఇస్తామనే ప్రకటనలు చాలా సందర్భాల్లో మోసాలకు సంబంధించినవే కావచ్చు. అంతేకాదు, నకిలీ యాప్‌లలో ఉత్పత్తుల పేర్లు, వాటి వివరణలు కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఇలాంటి విషయాలను గమనించాలి.
క్యాష్ ఆన్ డెలివరీ పేరుతో
సాధారణంగా ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆప్షన్ ఉంటే చాలామంది దాన్నే సెలెక్ట్ చేస్తుంటారు. ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి సురక్షితంగా భావిస్తారు.
అయితే కొన్ని నకిలీ యాప్స్ కూడా COD ఉందని మొదట చూపిస్తాయి. కానీ ఆర్డర్ చివరిలో మాత్రం UPI ద్వారా పేమెంట్ చేయాలనీ అడుగుతాయి. ముఖ్యంగా UPI QR కోడ్ స్కాన్ చేసినప్పుడు వ్యాపార సంస్థ పేరుకు బదులుగా వ్యక్తిగత పేర్లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పంపించే ముందు వివరాలను చెక్ చేసుకోవాలి.
రివ్యూలు చూసి కూడా మోసపోవద్దు
ఏదైనా వస్తువు కొనేముందు చాలామంది కస్టమర్ రివ్యూలు, రేటింగ్స్ చూస్తుంటారు. నకిలీ యాప్‌లలో కూడా వేల సంఖ్యలో మంచి రివ్యూలు ఉన్నట్లు చూపిస్తారు. కానీ వాటిని ఓపెన్ చేసి చదివితే అసలు విషయం అర్థమవుతుంది.
చూపించినన్ని రివ్యూలు ఉండవు. కొద్ది మంది మాత్రమే ఒకే రకమైన కామెంట్లు పెట్టినట్లు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకే ఖాతాలు అన్ని ఉత్పత్తులకు పాజిటివ్ రివ్యూలు ఇస్తుంటాయి. కాబట్టి రేటింగ్ చూసి మాత్రమే వస్తువులు కొనకూడదు.
డెలివరీ తేదీల్లోనూ తప్పులు
నకిలీ యాప్స్ గుర్తించడానికి మరో మార్గం డెలివరీ తేదీలను పరిశీలించడం. గూగుల్ ప్లేలోని కొన్ని యాప్స్ రివ్యూలలో విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. అక్టోబర్ 10న ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు ఆగస్టు 27న డెలివరీ చేస్తామని చూపించినట్లు ఒక రివ్యూలో పేర్కొన్నారు.
ఇలాంటి అసాధ్యమైన తేదీలు కనిపిస్తే ఆ యాప్‌పై అనుమానం రావాల్సిందే. ఆర్డర్ చేసే ముందు డెలివరీ వివరాలు కూడా ఒకసారి పరిశీలించాలి.
ఫేస్‌బుక్ ప్రకటనలతో నకిలీ యాప్స్ ప్రచారం
ఈ నకిలీ యాప్స్ ప్రజలకు చేరవేసేందుకు మోసగాళ్లు సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో వేల రూపాయలు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తున్నారు. బెంగాలీ, కన్నడ, తమిళ భాషల్లో వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రకటనలు రూపొందించినట్లు పరిశీలనలో వెల్లడైంది.
అక్టోబర్ 28 నాటికి మెటా యాడ్స్ నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని ప్రకటనలను తొలగించింది. అయినప్పటికీ మరికొన్ని ప్రకటనలు కొనసాగుతున్నట్లు గుర్తించారు.
రూ.30 కోట్ల సైబర్ మోసం..
ఇదిలా ఉంటే, సుమారు రూ.30 కోట్ల విలువైన సైబర్ మోసానికి సంబంధించి అక్టోబర్ 26న గ్రేటర్ నోయిడాలో ఢిల్లీ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని రూ.799 విలువైన కుర్తీని ఆర్డర్ చేయగా, ఆమె నుంచి రూ.6,450 మోసం చేసి వసూలు చేశారు. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో పెద్ద సైబర్ మోసాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు
దీపావళి పండగ సందర్భంగా ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి తొందరపడి కొనుగోళ్లు చేయకండి. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటించండి.
*గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక యాప్ స్టోర్ నుంచే షాపింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
*యాప్ పేరు, లోగో, డెవలపర్ వివరాలను పరిశీలించండి.
*నమ్మశక్యం కాని భారీ డిస్కౌంట్లను వెంటనే నమ్మకండి.
*తెలియని వ్యక్తులు పంపే షాపింగ్ లింక్‌లను క్లిక్ చేయకండి.
*UPI ద్వారా డబ్బులు పంపించే ముందు ఖాతా వివరాలు సరిచూసుకోండి.
*రేటింగ్‌లు, రివ్యూలను పూర్తిగా పరిశీలించండి.
*అనుమానాస్పద యాప్‌లలో బ్యాంక్ వివరాలు, OTPలు, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయకండి.
గుర్తుంచుకోండి.. పండుగ ఆఫర్ పేరుతో వచ్చే ప్రతి ప్రకటన నిజం కాదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ డబ్బును సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
