హైదరాబాద్లో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

హైదరాబాద్లో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ కు వచ్చే జలాలు తగ్గిపోవటం, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లో నీరు అడుగంటి పోవడంతో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నవంబర్ 1 నుంచి  గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరపనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.    

 గ్రీన్ వాటర్ ట్యాంకర్లపై  సమీక్ష జరిపిన ఎండీ అశోక్ రెడ్డి..  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

తాగునీటికి కాకుండా ఇతర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటి వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, గ్రీనరీ అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్ సంస్థలకు శుద్ధి చేసిన నీటి సరఫరా చేయనున్నారు. 

నిర్మాణ రంగం, పరిశ్రమలు, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు గ్రీన్ వాటర్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 31 నాటికి అన్ని ఫిల్లింగ్ పాయింట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.  10 వేల నుంచి 30 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్ల నమోదు చేయాలని ఆదేశించారు. 

ప్రస్తుతం 56 ట్యాంకర్లు, 9 మంది వినియోగదారుల నమోదు చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 31 నాటికి 300 నుంచి 400 ట్యాంకర్ల నమోదుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ట్యాంకర్‌పై 'తాగడానికి పనికిరాదు' హెచ్చరిక తప్పనిసరి ఉండాలని ఆదేశించారు. 

అక్టోబర్ 31 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల బుకింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. యాప్, కమాండ్ కంట్రోల్ డ్యాష్‌బోర్డు ద్వారా బుకింగ్‌లు, సరఫరా పర్యవేక్షిస్తారు. అక్టోబర్ 31న ఎస్టీపీల వద్ద అధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తారు. 

ఫిల్లింగ్ పాయింట్ల వద్ద ట్రయల్ రన్ నిర్వహించాలని ఎండీ ఆదేశించారు. నవంబర్ 1న ఉదయం నుంచే గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సరఫరా ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఫిల్లింగ్ పాయింట్ వద్ద నాలుగైదు ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలన్నారు. తొలి ఐదు రోజుల పాటు 24 గంటల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. 

శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంతో భూగర్భ జలాల సంరక్షణ జరుగుతుందన్నారు. తాగునీటిపై ఒత్తిడి తగ్గించడమే గ్రీన్ వాటర్ కార్యక్రమ లక్ష్యంగా చెప్పారు. గ్రీన్ వాటర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.