అమెరికాలోని ఆ 30 ఎకరాల భూమి మహాత్మాగాంధీ మనవడిదే

అమెరికాలోని ఆ 30 ఎకరాల భూమి మహాత్మాగాంధీ మనవడిదే

మహాత్మా గాంధీ మనవడు కనూ గాంధీకి చెందిన అమెరికాలోని 30 ఎకరాల భూవివాదానికి ఎట్టకేలకు తెరపడింది. వర్జీనియాలోని ఈ విలువైన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన స్థానికుడి వాదనలను కోర్టు తోసిపుచ్చింది. 20 నెలల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ, భూమిని ఖాళీ చేసి ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది.

అమెరికాలో మహాత్మా గాంధీ మనవడైన దివంగత కానూ గాంధీ ఆస్తి 30 ఎకరాల భూమి వివాదం సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ముగిసింది. దాదాపు 20 నెలల పాటు సాగిన ఈ చట్టపరమైన పోరాటంలో గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. 

వర్జినియాలోని వారెన్ కౌంటీలోని షెనాండో నేషనల్ పార్క్ ఆనుకుని ఉన్న 30 ఎకరాల విలువైన భూమిని కానూ గాంధీ, ఆయన భార్య శివా గాంధీ కలిసి 1987లో కొనుగోలు చేశారు. ఈ దంపతులు తమ చివరి రోజుల్లో గుజరాత్ సూరత్‌కు తిరిగివచ్చారు. 2016లో కానూ గాంధీ మరణించిన తర్వాత, ఆయన భార్య శివా గాంధీ 2018లో ది డాక్టర్ శివా అండ్ కానూ రాందాస్ మోహన్‌దాస్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఒక సేవా సంస్థను స్థాపించి, గాంధీజీ సిద్ధాంతాల ప్రచారం కోసం తమ ఆస్తులను ఆ ట్రస్టుకు రాసిచ్చి కన్నుమూశారు. 

వివాదం ఎంటీ.. 

వర్జీనియాకు చెందిన గ్రెగరీ బ్లాక్ అనే అమెరికన్.. 2025 జనవరిలో ట్రస్టీ పరిమళ్ దేశాయ్‌కు లీగల్ నోటీసు పంపాడు. వర్జీనియాలోని అడ్వర్స్ పొసెషన్ అంటే ఒక భూమిపై 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా హక్కు కలిగి ఉంటే అది వారికే చెందుతుందనే చట్టం నిబంధనను ఆసరాగా చేసుకుని ఆ 30 ఎకరాల భూమి తనదేనని క్లెయిమ్ చేశాడు.

న్యాయపోరాటం.. - ఏఐ (AI) వినియోగం..

ఈ కేసును ట్రస్టీ పరిమళ్ దేశాయ్.. అమెరికాలో లాయర్లను నియమించుకోవడంతో పాటు, న్యాయపరమైన వ్యూహాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను  GIS మ్యాప్ లను ఉపయోగించారు. ఆ భూమిలో పిటిషనర్ అయిన అమెరికన్ నిర్మించానని చెబుతున్న కేబిన్ 15 ఏళ్లుగా అక్కడ లేదని జీఐఎస్ మ్యాపుల ద్వారా కోర్టులో నిరూపించారు.

కోర్టు తీర్పు..

సుదీర్ఘ వాదనల తర్వాత నిందితుడు తన క్లెయిమ్‌ను నిరూపించలేకపోవడంతో అమెరికా కోర్టు గాంధీ ట్రస్టుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భూమిపై అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను వెంటనే తొలగించాలని అమెరికన్ పౌరుడిని కోర్టు ఆదేశించింది.

ఈ చారిత్రాత్మక తీర్పుతో, గాంధేయ సిద్ధాంతాల వ్యాప్తి కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుకు ఆ 30 ఎకరాల విలువైన ల్యాండ్ టైటిల్ అధికారికంగా దక్కింది.