మియాపూర్ భూముల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి గురువారం ( అక్టోబర్ 29 ) విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఈ భూములపై ప్రైవేటు వ్యక్తుల హక్కుల వాదనలను తిరస్కరించింది సుప్రీంకోర్టు.ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లన్నీ కొట్టేసింది కోర్టు.దీంతో మియాపూర్లోని సర్వే నంబర్లు 100, 101లో భూములపై దశాబ్దాల వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్లయింది.
550 ఎకరాలకు పైగా భూములపై వివిధ వర్గాల యాజమాన్య హక్కుల వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1949లో జాగీర్ వ్యవస్థ రద్దు తర్వాత భూములపై హక్కుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. జాగీర్ హక్కులు ఉన్నంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది.మియాపూర్ భూముల వివాదంలో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.
1912 నుంచి ఉన్న ప్రభుత్వ రికార్డులకు ప్రాధాన్యత ఇస్తూ.. పహాణీ రికార్డుల్లో పేర్లు ఉన్నంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు రావని స్పష్టం చేసింది కోర్టు. భూములపై హక్కులను నిరూపించడంలో అప్పీలుదారులు విఫలమయ్యారని తెలిపింది.
భూములు ప్రభుత్వానికి చెందుతాయన్న హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. భూముల వివాదంలో పరిహారం లేదా ఇతర సమానత్వపరమైన ఉపశమనాలకు కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు.
