పాకిస్తాన్‌లో రణ్‌బీర్ 'రామాయణ' క్రేజ్.. పోస్టర్లతో ర్యాలీ, ఆలయంలో ప్రత్యేక పూజలు!

పాకిస్తాన్‌లో రణ్‌బీర్ 'రామాయణ' క్రేజ్.. పోస్టర్లతో ర్యాలీ, ఆలయంలో ప్రత్యేక పూజలు!

భారతీయ ఇతిహాసం 'రామాయణం' కు ఉన్న ఆదరణ దేశ సరిహద్దులను కూడా దాటుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించారు. ఈ మైథలాజికల్ మూవీ 'రామాయణ'పై పాకిస్తాన్‌లోనూ ఆసక్తికరమైన స్పందన కనిపిస్తోంది. కరాచీలోని హిందూ కమ్యూనిటీ సభ్యులు ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.  ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో  సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కరాచీలో పలువురు హిందువులు 'రామాయణ' పోస్టర్‌ను చేతబట్టి వీధుల్లో ర్యాలీ నిర్వహించిన వీడియోలను పాకిస్తాన్ స్థానిక యూట్యూబర్ షేర్ చేశారు. సంప్రదాయ సంగీతం, డప్పుల చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కరాచీలోని లక్ష్మీ నారాయణ ఆలయానికి చేరుకుని సినిమా పోస్టర్‌ను ప్రదర్శిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌తో పాటు దర్శకుడు నితేశ్ తివారీ, చిత్ర బృందానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించాలని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. కొందరైతే ఈ చిత్రం ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవాలని కోరారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ వేడుక ద్వారా చాటిచెప్పారు.

ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణం, సంగీతంతో భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయాలన్నది చిత్ర బృందం లక్ష్యంగా ఉంది.

ఈ సిని మా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5, 2026న విడుదల కావాల్సి ఉంది. రెండో భాగాన్ని దీపావళి 2027 సందర్భంగా విడుదల కానుంది. అయితే పాకిస్తాన్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందా లేదా చూడాలి.  మొత్తానికి, కరాచీలో జరిగిన ఈ వేడుకలు 'రామాయణ'పై సరిహద్దులు దాటిన ఆసక్తిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.