సామాన్యులకు మరో షాక్.. లీటర్ పాలపై రూ.8 పెంపు..!

సామాన్యులకు మరో షాక్.. లీటర్ పాలపై రూ.8 పెంపు..!

బెంగళూర్: నిత్యావసర ధరల పెంపుతో ఇప్పటికే సతమతమవుతోన్న సామాన్యులకు కర్నాటక ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని పాల ధరను లీటర్‎కు రూ.8 చొప్పున పెంచింది. 2026, నవంబర్ 1వ తేదీ నుంచి ఈ పెరిగిన పాల ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. గురువారం (అక్టోబర్ 29) సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. 

ఈ సమావేశంలో నందిని పాల ధర పెంపునకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంత్రి కృష్ణ బైరే గౌడ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందిని పాల ధరను లీటర్‎కు రూ.8 మేర పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. నవంబర్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు. 

పెంచిన 8 రూపాయల్లో.. రూ.7 పాల ఉత్పత్తిదారులకు, మిగిలిన రూ.1 పాల సహకార సంఘాలకు కేటాయించనున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ధరలను పెంచాలని రైతులు, పాడి సహకార సంఘాలు చేసిన డిమాండ్లకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు తెలిపారు. 

పాల ధర పెంపు అంశంపై కేబినెట్ రెండు మూడు సార్లు చర్చించిందని చెప్పారు. పాల ధరల పెంపు కోసం ఉత్పత్తిదారులు నిరసనలు చేపట్టగా, పాడి సహకార సంఘాలు ధరలను సవరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని చెప్పారు. లీటర్‎కు రూ.10 పెంచాలని డిమాండ్ చేయగా.. ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూ.8 పెంపునకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పాల ధరల పెంపుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.