హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని అన్నారు.
గతంలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు నిరాధారమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ను లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అలాగే వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం కూడా తనకు లేదని తెలిపారు.
తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురై ఉంటే అందుకు చింతిస్తున్నట్లు కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో కొండా సురేఖ ఇచ్చిన ఈ వివరణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
— Konda Surekha (@iamkondasurekha) October 29, 2026
