RSS పుట్టిన నాగపూర్ గడ్డపై కాంగ్రెస్ ఎలా గెలిచింది : బీజేపీని ఓడించిన అభిజిత్ వంజారి ఎవరు..!

RSS పుట్టిన నాగపూర్ గడ్డపై కాంగ్రెస్ ఎలా గెలిచింది : బీజేపీని ఓడించిన అభిజిత్ వంజారి ఎవరు..!

ఆరెస్సెస్ పుట్టిన గడ్డ అది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల స్థస్థలం కూడా. దీనికి తోడు ఆరు దశాబ్దాల పాటు అంటే అరవై ఏళ్లపాటు బీజేపీ ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం. అలాంటి చోట కాంగ్రెస్ అభ్యర్థి గెలవటం అంటే మామూలు విషయం కాదు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత  ఎమ్మెల్సీ మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ విజయం సాధించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా  మారింది.  

 మహారాష్ట్ర శాసనమండలి  ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘన విజయం చేకూరింది. నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ అభిజిత్ వాంజారీ  నిలుపుకున్నారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్లేను 3 వేల 271 ఓట్ల తేడాతో ఓడించారు.  దాదాపు ఆరు దశాబ్దాలపాటు బీజేపీ ఆధిపత్యంలో ఉన్న ఈ స్థానాన్ని 2020లో వాంజారీ గెలుచుకున్నారు. ఇప్పుడు రెండోసారి విజయం సాధించడం గమనార్హం. 

గెలిచి ఓడిన బీజేపీ.. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అదే కీలకం:

 2026 అక్టోబర్ 23న పోలింగ్ జరగగా, 27న ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కోహ్లే 60 వేల 924 ఓట్లు సాధించగా, వాంజారీ 56 వేల 630 ఓట్లు పొందారు. స్వతంత్ర అభ్యర్థి నితేష్ కరాలేకు 24,249 ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్థికీ కోటా నిండకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో  వాంజారీ ముందంజ వేసి చివరకు 67 వేల 231 ఓట్లు సాధించి గెలుపొందారు. 40 గంటలకు పైగా సాగిన  లెక్కింపులో ..  కోహ్లే 63 వేల960 ఓట్లకే పరిమితమయ్యారు. 

ఎవరీ అభిజిత్ వాంజారీ ?

అభిజిత్ వాంజారీ నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు. ఆయన తండ్రి గోవింద్‌రావ్ వంజారీ దక్షిణ నాగ్‌పూర్ నుంచి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్రసంత్ తుకడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, లా డిగ్రీలు పూర్తి చేశారు. ఎన్‌ఎస్‌యుఐ (కాంగ్రెస్ విద్యార్థి విభాగం) మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. విద్యారంగంలో కూడా చురుకుగా ఉన్నారు. అమర్ సేవా మండల్ కార్యదర్శిగా వివిధ కళాశాలలను నడుపుతున్నారు.

2020లో బీజేపీ అభ్యర్థి సందీప్ జోషిని 18 వేల 910 ఓట్ల తేడాతో ఓడించి మొదటిసారి ఈ స్థానం గెలుచుకున్నారు. ఈసారి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఐక్యత, 48 సామాజిక, ఉద్యోగ సంఘాల మద్దతుతో విజయం సాధించినట్లు వాంజారీ తెలిపారు. 

అయితే ఈ ఎన్నికల కోసం బీజేపీ శాయశక్తులను ఒడ్డింది. దేశం నుంచి నేతలందరూ  నాగ్‌పూర్‌కు వచ్చారు. అయినా ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు అని వంఝారీ అన్నారు.  
మహారాష్ట్రలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎంవీఏ మూడు స్థానాలు గెలుచుకోగా, బీజేపీ, శివసేన ఒక్కొక్కటి సాధించాయి. ఈ విజయంతో ఆర్‌ఎస్‌ఎస్, ఫడ్నవీస్-గడ్కరీ కోటలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవడం చర్చనీయాంశంగా మారింది.