సంపాదన లేదని తప్పించుకోవటం కుదరదు: భార్యకు మెయింటెనెన్స్ కట్టాల్సిందే: అలహాబాద్ హైకోర్టు

సంపాదన లేదని తప్పించుకోవటం కుదరదు: భార్యకు మెయింటెనెన్స్ కట్టాల్సిందే: అలహాబాద్ హైకోర్టు

నాకు ఉద్యోగం లేదు.. వ్యాపారం సరిగా నడవట్లేదు.. భరణం ఎలా ఇవ్వగలను? అని చాలామంది భర్తలు కోర్టుల్లో చెబుతుంటారు. కానీ ఇలాంటి మాటలు చెప్పినంత మాత్రాన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించే బాధ్యత నుంచి భర్తలు తప్పించుకోలేరని అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో స్పష్టం చేసింది. 'మొహమ్మద్ కమిల్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం' కేసులో సెప్టెంబర్ 30, 2026న వెలువడిన ఈ తీర్పు కుటుంబ చట్టా్ల్లో అత్యంత కీలకంగా మారింది. భర్తకు రెగ్యులర్ శాలరీ లేకపోయినా, అతని సంపాదనా సామర్థ్యాన్ని బట్టి కోర్టులు భార్యకు చెల్లించాల్సిన భరణం నిర్ణయించవచ్చని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.

కస్గంజ్ లోని గ్రామ్ న్యాయాలయ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి స్థిర ఆదాయం లేదని, భార్య కావాలనే పుట్టింటికి వెళ్ళిందని ఆయన వాదించారు. అయితే భార్యకు స్వయం ఉపాధి లేదని, ఆమె తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉందని కోర్టు గుర్తించింది. వరకట్న వేధింపుల కారణంగానే ఆమె ఇంటి నుంచి గెంటివేయబడినట్లు విచారణలో తేలింది. నెలకు రూ.3వేల 500 మెయింటెనెన్స్ చాలా తక్కువని.. భార్య తనతో ఉంటే అంతకంటే ఎక్కువే ఖర్చు అయ్యేదని హైకోర్టు పేర్కొంటూ భర్త అప్పీల్‌ను కొట్టేసింది. అంతేకాకుండా తీర్పు వెలువడిన రోజు నుంచి కాకుండా.. భార్య దరఖాస్తు పెట్టుకున్న తేదీ నుంచే భరణం చెల్లించాలని ఆదేశించింది.

నిరుద్యోగిగా ఉండటానికీ, సంపాదించే సామర్థ్యం లేకపోవడానికీ చాలా తేడా ఉందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేవలం ఆదాయం లేదని చెప్పడం ద్వారా చట్టపరమైన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. అయితే కోర్టు కేవలం అంచనాలతో కాకుండా.. భర్త ఆస్తులు, బ్యాంకు అకౌంట్స్, వ్యాపార లావాదేవీలు, లైఫ్ స్టైల్ వంటి ఆధారాలను పరిగణలోకి తీసుకుని అతని ఆర్థిక సామర్థ్యాన్ని బేరీజు వేస్తుంది. భార్య చదువుకున్నప్పటికీ.. ఆమెకు స్వయంగా ఆదాయం లేనంత కాలం భరణం కోరే హక్కు ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది.

ALSO READ : అమెజాన్ లో ఈ డిపార్ట్ మెంట్స్ మూసివేత

భరణం చట్టం ముఖ్య ఉద్దేశం ఇదే..
సెక్షన్ 125 CrPC ప్రకారం భార్యను ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించడం, ఆమె ఆత్మగౌరవంతో బతికేలా చూడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. భర్త ఆర్థిక పరిస్థితి నిజంగా దిగజారితే, చట్టపరమైన మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించి మినహాయింపు కోరవచ్చు. కానీ సొంతంగా భరణం ఆపడానికి వీలేదు. సంపాదన లేదనే సాకులతో భార్యలను అర్ధాకలితో ఉంచే భర్తలకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని చెప్పవచ్చు. కావాలనే భార్యలను ఇబ్బంది పెట్టి వేధించే భర్తలకు కోర్టు తీర్పు షాక్ అనే చెప్పాలి.