అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులను లేఆఫ్ చేసింది. తన డివైసెస్ అండ్ సర్వీసెస్ యూనిట్‌లో సుమారు 250 మంది ఉద్యోగులను తొలగించినట్లు టెక్ దిగ్గజం వెల్లడించింది. కొత్త కిండ్లే ఈ-రీడర్స్, టాబ్లెట్స్, అలెక్సా ఆధారిత డివైస్‌ల మార్కెట్ లాంచ్‌ల తర్వాత ఈ తొలగింపులు జరిగాయి. లేఆఫ్స్ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలోని ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపాయి. కంపెనీ తన ప్రొడక్టివిటీని మెరుగుపరచుకోవడానికి, తమ ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా మారడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఈ లేఆఫ్స్‌కు సంబంధించి హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ చెరీ రాబిసన్ స్వయంగా ఉద్యోగులకు బుధవారం ఉదయం ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. కంపెనీలో సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ లేఆఫ్స్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు అమెజాన్ తమ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోసం ఓ కీలక అంతర్గత మెమోను విడుదల చేసింది. నామమాత్రపు టోకెన్ వినియోగం, కేవలం కోడ్ మార్పులు లేదా లెక్కల కోసం కాకుండా.. నిజమైన కస్టమర్ సమస్యలను పరిష్కారానికి AI సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఇంజనీర్లను కోరింది. కాలానికి తగినట్లుగా మారకపోతే వెనుకబడిపోతామని హెచ్చరించింది.
ALSO READ : ఎంపీలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ..
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెజాన్ వివిధ డిపార్ట్మెంట్లలో వరుసగా లేఆఫ్స్ చేస్తూనే ఉంది. ఈ నెల ప్రారంభంలో ప్రధాన ఈ-కామర్స్ స్టోర్స్ యూనిట్‌లో 1,000 మందిని తొలగించింది. అంతకుముందు నిర్వహించిన లేఆఫ్స్ లో కంపెనీ దాదాపు 30వేల మంది ఉద్యోగులను తగ్గించింది. గత ఏడాది అక్టోబర్‌లో 14వేల మందిని, ఈ ఏడాది జనవరిలో మరో 16వేల మందిని తొలగించినట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుత టెక్ వాతావరణంలో ఖర్చులను తగ్గించుకుంటూ.. ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీ వైపు కంపెనీ వేగంగా మళ్లుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కోతలు జరుగుతున్నాయని టెక్ దిగ్గజం చెబుతోంది.
